రేపు గుడివాడకు సీఎం చంద్రబాబు…

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ముమ్మర సన్నాహాలు…
కూటమి నాయకత్వం రంగంలోకి
ప్రజా ఉత్సవంగా సీఎం పర్యటన నిర్వహిస్తాం: ఎమ్మెల్యే రాము


గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడకు శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. గౌతమ్ పాఠశాల వద్ద జరగనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సీఎంఓ అధికారులతో కలిసి గుడివాడ బైపాస్ రోడ్డు, ఇంజనీరింగ్ కళాశాల, ఏఎన్ఆర్ కళాశాలను పరిశీలించారు.

కలెక్టర్ బాలాజీ అధ్యక్షతన సమీక్ష :

సీఎం పర్యటన విజయవంతానికి గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో కలెక్టర్ డీకే బాలాజీ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భద్రత, ట్రాఫిక్, ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని పర్యటన ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సీఎం పర్యటనను ప్రజా ఉత్సవంగా నిర్వహిస్తామని, అధికారుల సమన్వయంతో కూటమి నాయకత్వం పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతుందని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు.

వేదికలు ఖరారు…
సీఎం పర్యటనలో భాగంగా ఏఎన్ఆర్ కళాశాలలో హెలిప్యాడ్, ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభ, బైపాస్ రోడ్డులోని యలవర్తి గ్రౌండ్స్ లో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశ వేదికలను అధికారులు ఖరారు చేశారు. సీఎం పర్యటనకు గంటల వ్యవధి ఉండడంతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నాయకత్వంలో టీడీపీ నాయకత్వం ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమైంది.

సీఎం పర్యటన ఏర్పాట్లు, సమావేశంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మండల పట్టణ అధ్యక్షులు దానేటి సన్యాసిరావు, పండ్రాజ్ సాంబయ్య, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ కుమార్, గుడివాడ ఆర్టీవో బాలసుబ్రమణ్యం, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ తో పాటు పోలీస్, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.