ప్రజల సౌకర్యం కోసం ప్రజా రవాణాను అభివృద్ధి చేస్తాం

ప్రజల సౌకర్యం కోసం ప్రజా రవాణాను అభివృద్ధి చేస్తాం
- ప్రజా రవాణా సేవలను మరింత బలోపేతం చేస్తున్నాం
- మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు
మంథని, ఆంధ్రప్రభ : ప్రజల సౌకర్యార్థం ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మహాలక్ష్మి పథకానికి రూపకర్త మంత్రి శ్రీధర్ బాబేనని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
మంథని మున్సిపాలిటీ పరిధిలోని మంథని బస్టాండ్‌లో రూ.93 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు ప్లాట్‌ఫారాలు, ఇతర అభివృద్ధి పనులకు ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు మంథని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

గోదావరి పుష్కరాలు–2027 నిర్వహణ కోసం ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీని నియమించిందని, కుంభమేళాను తలపించే స్థాయిలో పుష్కరాలను నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది మంది భక్తులు పుష్కరాలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రతి గ్రామం నుంచి పుష్కర క్షేత్రాలకు చేరుకునేలా ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
బాసర నుంచి భద్రాచలం వరకు బస్టాండ్లను ఆధునికీకరించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సమ్మక్క–సారలమ్మ జాతరకు ఏర్పాటు చేసిన తరహాలోనే పుష్కరాల సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని చెప్పారు.
గత పదేళ్లలో కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకాలు, డిపోల ఏర్పాటు వంటి అంశాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొత్త బస్సుల కొనుగోలు, సిబ్బంది నియామకాలు, డిపోల ఏర్పాటు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు దాదాపు 310 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్టీసీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రస్తుతం రోజుకు సుమారు 65 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగిస్తుండగా, బస్సులు దాదాపు 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయని తెలిపారు. ప్రతి గ్రామానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించే దిశగా బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచుతున్నామని చెప్పారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గుర్తింపు సంఘాల ఎన్నికల అనంతరం కార్మిక ప్రతినిధులతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. కార్మికులు అపోహలను నమ్మవద్దని మంత్రి సూచించారు.
ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
మంత్రి శ్రీధర్ బాబు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మంథని బస్టాండ్‌లో రెండు అదనపు ప్లాట్‌ఫారాల నిర్మాణానికి రూ.74 లక్షలు, ఇతర అభివృద్ధి పనులకు రూ.19 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
కాళేశ్వరం బస్టాండ్ అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేశామని, కాళేశ్వరం దేవస్థాన అభివృద్ధిలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్షగా ఉన్న పెద్దపల్లి బస్ డిపో ఏర్పాటు త్వరలోనే సాకారం కానుందని, మంథని బస్టాండ్ ఆధునికీకరణతో పాటు పెద్దపల్లి బస్ డిపోను కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో రవాణా శాఖ మంత్రి, ఇతర మంత్రులతో కలిసి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల అనంతరం కార్మిక ప్రతినిధులతో చర్చించి ఆర్టీసీ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, కరీంనగర్ రీజనల్ మేనేజర్ రాజు, డిప్యూటీ ఆర్ఎం (ఎం) మల్లేశం, డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్, ఆర్డీఓ సురేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, విద్యుత్ నియంత్రణ కమిటీ సభ్యుడు, న్యాయవాది శశిభూషణ్ కాచే, జిల్లా అధికార ప్రతినిధి సెగ్గెం రాజేష్, సర్పంచులు రామస్వామి, పోచం, ఎర్రవెల్లి కృష్ణవేణి–నరేశ్‌రావు, నాయకులు తొట్ల తిరుపతి, మంథని సత్యం, కొఠారి బాపు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
