గంజాయి, గుడుంబాపై అప్రమత్తంగా ఉండాలి

గంజాయి, గుడుంబాపై అప్రమత్తంగా ఉండాలి
- ఎస్‌ఐ ముత్యం రాజేందర్
రాయపర్తి, ఆంధ్రప్రభ : గ్రామాల్లో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా రాయపర్తి పోలీసులు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు ముమ్మరం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో ఆదివారం రాయపర్తి ఎస్‌ఐ ముత్యం రాజేందర్ ఆధ్వర్యంలో జనమైత్రి అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్‌ఐ రాజేందర్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకొని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, మహిళలు, రైతులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ రాజేందర్ మాట్లాడుతూ.. గ్రామ భద్రతకు సీసీటీవీ కెమెరాలు ఎంత అవసరమో వివరించారు.
గ్రామంలోని ప్రధాన కూడళ్లు, రాకపోకలు సాగించే మార్గాల్లో కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని,నేరం జరిగిన వెంటనే నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని,ఇది ఒక్క పోలీసుల బాధ్యతే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. కెమెరాల ఏర్పాటుకు పోలీస్ శాఖ నుండి పూర్తి సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం యువతను పట్టిపీడిస్తున్న గంజాయి, గుడుంబా మహమ్మారిపై ప్రజలను అప్రమత్తం చేశారు.
గంజాయి, గుడుంబా యువత జీవితాలను నాశనం చేస్తున్నాయని,ఆరోగ్యాన్ని పాడుచేసి కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయని,వీటి విక్రయాలు, వినియోగం చట్టరీత్యా తీవ్ర నేరం. మీ పరిసరాల్లో ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే 100కు డయల్ చేసి గానీ, నాకు వ్యక్తిగతంగా గానీ సమాచారం ఇవ్వలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి, ప్రభుత్వం నుండి రివార్డు కూడా ఇప్పిస్తామని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా అవగాహన కల్పించారు.
అనంతరం గ్రామ సర్పంచ్ రాపాక పద్మ మాట్లాడుతూ.. ఎస్‌ఐ సార్ మా గ్రామానికి వచ్చి మంచి విషయాలు చెప్పారు. ఆయన సూచనల మేరకు గ్రామస్తుల సహకారంతో సీసీ కెమెరాలు పెట్టించే బాధ్యత తీసుకుంటానాని తెలిపారు. అలాగే మన ఊరి యువత భవిష్యత్తు కోసం గంజాయి, గుడుంబాను మన గ్రామంలోకి రానివ్వం. ఎవరైనా అమ్మినా, తయారు చేసినా పోలీసులకు పట్టిస్తాం. మన కాట్రపల్లిని నేర రహిత, మత్తు రహిత ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, రాయపర్తి పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేశారు.
