రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

జూలై 15లోపు దరఖాస్తు చేసుకోవాలి
ప్రతిభా పురస్కారాల కరపత్రం ఆవిష్కరించిన సీపీ వెంకటేష్

కర్నూలు – ఆంధ్రప్రభ : ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రజక విద్యార్థుల్లో విద్యా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఏడాది కూడా ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు రజక విద్యా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సీపీ వెంకటేష్ తెలిపారు.

ఆదివారం కర్నూలు నగరంలోని అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లోని స్కందా బిజినెస్ పార్క్‌లో గల రజక విద్యా సేవా సమితి కార్యాలయంలో 8వ రజక విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన రజక విద్యార్థులు ఈ పురస్కారాలకు అర్హులని తెలిపారు. పదో తరగతిలో 450 మార్కులు, ఇంటర్మీడియట్‌లో 75 శాతం మార్కులు, డిగ్రీ, బీటెక్, పీజీ కోర్సుల్లో 75 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ఉన్న అర్హులైన రజక విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి సన్మానించడం ద్వారా వారిలో మరింత ఉత్సాహం నింపడమే సమితి లక్ష్యమని పేర్కొన్నారు.

అర్హులైన విద్యార్థులు తమ దరఖాస్తులను జూలై 15వ తేదీలోపు కర్నూలులోని రజక విద్యా సేవా సమితి కార్యాలయానికి పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

పూర్తి వివరాల కోసం రజక విద్యా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సీపీ వెంకటేష్‌ను 91110 39651, 99593 66429, 95509 34626 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రజక విద్యా సేవా సమితి ఉపాధ్యక్షుడు సీనరసింహులు, కోశాధికారి సిద్ధ నాగేష్, సంయుక్త కార్యదర్శి వీరశేఖర్, సీనియర్ జర్నలిస్టు మద్దూరు వెంకట్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మద్దూరు వెంకటనారాయణ, నాగేష్, దామగట్ల రమణ, మధు, న్యాయవాది జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.