’తల్లికి వందనం’ పేరుతో నకిలీ లింకులు

’తల్లికి వందనం’ పేరుతో నకిలీ లింకులు

సైబర్ నేరగాళ్ల మోసాలకు తల్లిదండ్రులు గురికావద్దు: ఎస్పీ విక్రాంత్ పాటిల్

కర్నూలు, ఆంధ్రప్రభ:

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు విద్యార్థుల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పలు జాగ్రత్తలను సూచించారు.

పథకానికి సంబంధించిన దరఖాస్తులు, అర్హతలు, నగదు జమ, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాల పేరుతో వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌లు లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ఎస్పీ సూచించారు. ఇలాంటి నకిలీ లింకుల ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నంబర్లు, ఓటీపీలు, పాస్‌వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సైబర్ మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని తెలిపారు.

ప్రభుత్వ పథకాల సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లు, గ్రామ లేదా వార్డు సచివాలయాలు, సంబంధిత శాఖ అధికారులను మాత్రమే సంప్రదించాలని ఆయన సూచించారు. తెలియని వ్యక్తులు పంపిన సందేశాలు, లింకులు లేదా ఫోన్ కాల్స్‌ను నమ్మరాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్లు ఇతరులతో పంచుకోవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ పథకాల పేరుతో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎలాంటి అనుమానాస్పద లింకులు వచ్చినా వాటిని వెంటనే తొలగించాలని, ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయవద్దని సూచించారు.

సైబర్ మోసాలకు గురైన వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలని, లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని, లేదంటే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

ప్రజల్లో అవగాహనే రక్షణ

సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని పోలీసులు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ప్రతి సందేశాన్ని నమ్మకుండా, అధికారిక వనరుల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవడం ద్వారా సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply