ప్రేమ పేరుతో మోసగించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

ప్రేమ పేరుతో మోసగించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరులో 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసగించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. బాలిక కనిపించడం లేదంటూ ఆమె తండ్రి చెన్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం తప్పిపోయిన 16 ఏళ్ల బాలిక ఆచూకీని పోలీసులు గుర్తించినట్లు సీఐ వెల్లడించారు.

విద్యార్థినిని విచారించగా, చెన్నూరుకు చెందిన తుంగపిండి భాస్కర్ (27) గత రెండు నెలలుగా ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ నెల 26వ తేదీన చెన్నూర్ నుంచి బస్సులో మంచిర్యాలకు తీసుకెళ్లినట్లు ఆమె తెలిపింది. అక్కడ ఓ గదిలో రెండు రోజుల పాటు ఉంచి, తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక పోలీసులకు వెల్లడించింది.

తనపై పోలీసు కేసు నమోదైన విషయం తెలిసిన అనంతరం భాస్కర్ బాలికను నెన్నెలలోని బంధువుల ఇంటి వద్ద వదిలేసి పరారైనట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా వెంటనే పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, శనివారం మధ్యాహ్నం నిందితుడు తుంగపిండి భాస్కర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. భాస్కర్‌పై గతంలో కూడా ఒక పోక్సో కేసు నమోదైందని, అతనిపై రౌడీషీట్ కూడా నమోదు చేయనున్నట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు శ్యాం పటేల్, రాజశేఖర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply