చిరకాల నిరీక్షణకు తెర..

చిరకాల నిరీక్షణకు తెర..

వేలాది కుటుంబాలకు ఊరట

పాయకాపురం ఆంధ్రప్రభ : పేదల ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. జీఓ నెం. 306 ద్వారా అర్హులైన కుటుంబాలకు ఇంటి యాజమాన్య హక్కులు పొందే అవకాశం కల్పించబడిందని చెప్పారు.

సింగ్‌నగర్‌లోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వేలాది కుటుంబాల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విడుదలైన జీఓ నెం. 306 ద్వారా అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి రిజిస్ట్రేషన్ల మార్గం సుగమమైందన్నారు. సొంత ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ చట్టబద్ధమైన యాజమాన్య పత్రాలు లేకపోవడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తెలిపారు.

రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోవడం వల్ల బ్యాంకు రుణాలు పొందడం, కుటుంబ వారసత్వ బదిలీలు చేయడం, ఆస్తులపై హక్కులు సాధించడం వంటి అంశాల్లో ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు.

ప్రజలు పెద్ద సంఖ్యలో తన కార్యాలయానికి వచ్చి ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించాలని వినతులు అందించారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ అంశాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు శాసనసభలో కూడా ప్రస్తావించినట్లు వెల్లడించారు.

ప్రజల సమస్యలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి జీఓ నెం. 306ను తీసుకువచ్చారని తెలిపారు. ఈ జీవో ప్రకారం బీ-ఫామ్ పట్టా కలిగి పదేళ్లకు పైగా నివాసం ఉంటున్న అర్హులైన కుటుంబాలు తమ ఇళ్లను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం పొందనున్నాయని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో జారీ చేసిన ఓటీఎస్ బాండ్లు కలిగిన వారికి కూడా ఈ అవకాశం వర్తిస్తుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వివరించారు.

Leave a Reply