Lack of basic Amenities | నిర్మాణం లక్షల్లో.. నిర్వహణ శూన్యం…

Lack of basic Amenities | నిర్మాణం లక్షల్లో.. నిర్వహణ శూన్యం…

  • ప్రయాణికులకు తప్పని తిప్పలు
  • అంబేద్కర్ సెంటర్‌లో మూతపడ్డ పబ్లిక్ టాయిలెట్స్!

నర్సంపేట, (ఆంధ్రప్రభ): నర్సంపేట పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన అంబేద్కర్ సెంటర్‌లో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లు (మెథర్ సఫాయి కర్మచారి కాంప్లెక్స్) నెలల తరబడి తాళాలు వేసి నిరుపయోగంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజూ వందలాది మంది రాకపోకలు సాగించే ఈ కీలక కూడలిలో వాష్‌రూమ్ సౌకర్యం లేక ప్రజలు, ముఖ్యంగా మహిళ ప్రయాణికులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ పబ్లిక్ టాయిలెట్లు ప్రజల ఉపయోగం లేకుండాపోయిందని స్థానికులు మండిపడుతున్నారు. ఉపయోగం లేని టాయిలెట్లు ప్రజలకు ఏం ప్రయోజనం లేకుండా ఉంటే ఉన్నట్టా లేనట్టని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంబేద్కర్ సెంటర్లో నర్సంపేట పట్టణానికి ప్రధాన కూడలిగా ఉండటంతో 20 గ్రామాల నుండి వచ్చే ప్రజలు, బస్సుల కోసం వేచిచూసే ప్రయాణికులు, కూరగాయల వ్యాపారులు, చేపల అమ్మకందారులు, చిన్న హోటళ్లకు వచ్చే వినియోగ దారులు రోజంతా ఇక్కడే ఉంటారు.

ఇంతటి రద్దీ ప్రాంతంలో కనీసం వాష్‌ రూమ్ సౌకర్యం లేకపోవడం ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌరస్తాలో గంటల తరబడి ఉండాల్సివస్తోంది కానీ వాష్‌రూమ్ లేక ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి అని వారు వాపోతున్నారు.

ప్రజలకు ఉపయోగ పడాల్సిన సదుపాయాలు ఇలా మూతపడిపోవ డానికి కారణం ఏమిటి? పట్టణ అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పుకునే మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుగా ప్రజల ప్రాథమిక అవసరాలపై దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితమవుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంబేద్కర్ సెంటర్‌లోని పబ్లిక్ టాయిలెట్లను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, శుభ్రత, నీటి సౌకర్యాలు కల్పించి నిరంతర నిర్వహణ చేపట్టాలని ప్రజలు మున్సిపాలిటీ అధికారులను కోరుతున్నారు. లేదంటే ప్రజా సంఘాలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply