ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాల దిశగా ఏపీ టూరిజం

ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాల దిశగా ఏపీ టూరిజం
విజయవాడ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రశ్రేణి పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు.
ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దూరదృష్టి, మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రతి పర్యాటక ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. “ఏ ఇజం లేదు.. టూరిజమే అజెండా” అనే నినాదంతో పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆధారంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
విజయవాడలోని హరిత బెర్మ్ పార్క్‌లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో టూరిజం ప్రమోషన్, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మావతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రాజెక్ట్స్ శేషగిరి, డివిజన్ మేనేజర్లు, యూనిట్ మేనేజర్లు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని అన్ని పర్యాటక కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు కల్పించడంపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. పర్యాటకుల భద్రత, సౌకర్యాలను మెరుగుపరచేందుకు ప్రతి టూరిస్ట్ డెస్టినేషన్‌లో సీసీ కెమెరాలు, ఉచిత వై-ఫై సేవలు, ఆధునిక మరుగుదొడ్లు, పరిశుభ్రమైన వాతావరణం, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
రాష్ట్రానికి వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన అనుభూతి కల్పించేందుకు ప్రత్యేక పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసి, “సేఫ్ అండ్ సెక్యూర్ టూరిజం” లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులు అభిప్రాయపడ్డారు.
పర్యాటక రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తెలిపారు. పర్యాటక శాఖకు చెందిన అన్ని యూనిట్లు సమన్వయంతో పనిచేసి సేవల నాణ్యతను పెంచాలని సూచించారు.
మంచి ఆదాయం, లాభాలు ఆర్జించిన యూనిట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా సిబ్బందిలో పోటీ భావన, పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని బీచ్‌లు, ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రకృతి విహార ప్రాంతాలు, హిల్ స్టేషన్లు, హెరిటేజ్ ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి, ప్రపంచ పర్యాటక మ్యాప్‌పై ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అధికారులు వెల్లడించారు.
