Karimnagar | బీహార్ టు కరీంనగర్..

Karimnagar | బీహార్ టు కరీంనగర్..

  • పీఎంజేలో చోరీ కేసు సూత్రధారి అరెస్ట్..
  • బీహార్లోని ఆరు కోర్టుల నుంచి పీటీ వారెంట్లు
  • కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
  • ఎట్టకేలకు అదుపులోకి సుబోధ్ సింగ్

కరీంనగర్ క్రైమ్ (ఆంధ్రప్రభ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే (PMJ) జ్యువెలరీ దోపిడీ కేసు సూత్రధారి సుబోధ్ సింగ్‌ను కరీంనగర్ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌లోని పూర్ణియా జైలులో ఉన్న అతడిని, అక్కడి ఆరు కోర్టుల నుంచి పీటీ (Prisoner Transit) వారెంట్లు పొంది కరీంనగర్‌కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఈ నెల 3వ తేదీన కరీంనగర్ పట్టణంలోని పీఎంజే జ్యువెలరీలో పనిచేసే ఉద్యోగులపై కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంచలన కేసులో ప్రధాన నిందితుడు, అంతర్రాష్ట్ర నేరగాడైన సుబోధ్ సింగ్‌ను పక్కా ప్రణాళికతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేర‌కు సీపీ ప్ర‌క‌టించారు.

అతడిపై ఈ కేసుతోపాటు పలు రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదై ఉన్న నేపథ్యంలో, చట్టపరమైన ఇబ్బందులు లేకుండా మొత్తం ఆరు కోర్టుల పరిధిలో పీటీ వారెంట్లకు అనుమతులు పొందిన అనంతరం అతడిని కస్టడీలోకి తీసుకుని కరీంనగర్కు తరలించినట్లు సీపీ వివరించారు.

సుభోధ్ సింగ్ తో పాటు ప్రత్యేక పోలీసు బృందం గురువారం రాత్రి కరీంనగర్ కు చెరుకోగా, అర్ధరాత్రి నిందితుడిని గౌరవ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు తెలిపారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో అతడిని జైలుకు తరలించినట్లు వెల్లడించారు.

కేసుకు సంబంధించిన అంశాలపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు, నిందితుడిని వారం రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చె సినట్లు సీపీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply