రాయలసీమ హక్కుల పరిరక్షణే సిద్ధేశ్వరం మహాసభ లక్ష్యం

రాయలసీమ హక్కుల పరిరక్షణే సిద్ధేశ్వరం మహాసభ లక్ష్యం
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: రాయలసీమ సాగునీటి హక్కులు, పాలన–అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించిన చారిత్రాత్మక ఉద్యమ ఘట్టం “సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన” 10వ వార్షికోత్సవ మహాసభను మే 31న నంద్యాలలో నిర్వహిస్తున్నట్లు రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి తెలిపారు. శుక్రవారం సమితి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దం క్రితం ఉద్యమ నేపథ్యం లేని రాయలసీమలో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన కార్యక్రమం ద్వారా ప్రజా ఉద్యమానికి బీజం వేశామని అన్నారు.
ఆ స్ఫూర్తితో గత పదేళ్లుగా రాయలసీమ సాగునీటి హక్కులు, ప్రాంతీయ అసమానతలు, పాలన–అభివృద్ధి కేంద్రీకరణ వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంలో ఉద్యమం విజయవంతమైందని పేర్కొన్నారు. రాయలసీమ సమస్యలపై పాలకులపై ఒత్తిడి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అయితే, గత 12 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాయలసీమకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు విరుద్ధంగా, వారి వారసులుగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు రాయలసీమ అభివృద్ధికి విఘాతం కలిగించే విధంగా వ్యవహరించాయని ఆరోపించారు. రాయలసీమకు 200 టీఎంసీల అదనపు నికర జలాలను కేటాయిస్తామని రాయలసీమ డిక్లరేషన్ చేసిన భారతీయ జనతా పార్టీ కూడా తరువాత రాయలసీమ నీటి హక్కులను తెలంగాణకు మళ్లిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతాన్ని పావుగా ఉపయోగించుకుందని ఆయన విమర్శించారు.
గత 12 ఏళ్లుగా ఏర్పడిన ప్రభుత్వాలు రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాలను విస్మరించాయని అన్నారు. తమ రాజకీయ, ఆర్థిక సామ్రాజ్యాల నిర్మాణంపైనే దృష్టి పెట్టాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జరగనున్న మహాసభకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను గౌరవించే ప్రముఖులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఝాన్సీ లక్ష్మి, జస్టిస్ గోపాల గౌడ, ఆచార్య వెంకటేష్ తదితరులు ఈ సభలో పాల్గొంటారని చెప్పారు. రాయలసీమ హక్కులు, సమగ్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అంశాలపై వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి విఘాతం కలిగించే కేంద్రీకృత పాలనకు ముగింపు పలకాలని బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడిన రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పడే దిశగా ఈ మహాసభ వేదికగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాయలసీమ వాసులు, ప్రజాస్వామ్యవాదులు, సామాజిక కార్యకర్తలు, సమగ్రాభివృద్ధిని కోరుకునే ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు ఏర్వ రామచంద్రారెడ్డి, పట్నం రాముడు, ఆసదుల్లా, బాల ఈశ్వర్ రెడ్డి, మెహబూబ్ భాష, రాఘవేంద్ర, శివనాగిరెడ్డి, నిట్టూరి సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
