ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వార్షిక స్నాతకోత్సవాలకు వేళాయే..

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వార్షిక స్నాతకోత్సవాలకు వేళాయే..

  • జూన్ 2న విజయవాడలో 29వ, 30వ వార్షిక కాన్వొకేషన్లు
  • ప్రముఖ హృదయ వైద్య నిపుణులకు గౌరవ డాక్టరేట్లు
  • 122 మంది ప్రతిభావంతుల విద్యార్థులకు 162 పతకాలు
  • మెడల్స్‌, ఎండోమెంట్‌ బహుమతులతో సత్కారం

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడలోని డాక్టర్‌ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ ఆధ్వర్యంలో 29, 30వ వార్షిక స్నాతకోత్సవాలు జూన్‌ 2 న ఘనంగా నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ తలపల్లి సాయి సుధీర్‌ వెల్లడించారు. యూనివర్సిటీ ఆవరణలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవాల్లో దేశ ప్రఖ్యాత హృదయ వైద్య నిపుణులకు గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చెయ్ నున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రుల అరిత్మియా అండ్ ఎలక్ట్రోఫిజియాలజీ సేవల డైరెక్టర్‌ డాక్టర్‌ సి. నరసింహన్‌కు 29వ కాన్వొకేషన్‌లో గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్సెస్‌ (హోనోరిస్‌ కాజా) డిగ్రీ ప్రదానం చేస్తుండగా ఆయనే ఈ స్నాతకోత్సవ ప్రధాన అతిథిగా పాల్గొని కాన్వొకేషన్‌ ప్రసంగం చేస్తారని తెలిపారు.

అలాగే హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రుల కార్డియాక్‌ సైన్సెస్‌ విభాగం డైరెక్టర్‌, హెచ్‌వోడీ డాక్టర్‌ పి.సి. రాథ్‌కు 30వ కాన్వొకేషన్‌లో గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్సెస్‌ (హోనోరిస్‌ కాజా) డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. స్నాతకోత్సవాల్లో 2023 సంవత్సరానికి సంబంధించిన 29వ కాన్వొకేషన్‌, 2024 సంవత్సరానికి సంబంధించిన 30వ కాన్వొకేషన్‌ కింద ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పతకాలు, బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. 29వ వార్షిక కాన్వొకేషన్‌లో 62 మంది విద్యార్థులకు మొత్తం 83 పతకాలు ప్రదానం చేస్తుండగా,ఇందులో 62 బంగారు పతకాలు, 21 వెండి పతకాలు ఉన్నాయని, అదనంగా 18 ఎండోమెంట్‌ బహుమతులు ప్రధానం చేస్తామన్నారు.

30వ వార్షిక కాన్వొకేషన్‌లో 60 మంది విద్యార్థులకు మొత్తం 79 పతకాలు ఉండగా,ఇందులో 61 బంగారు పతకాలు, 18 వెండి పతకాలు ఉన్నాయిని, అలాగే 19 ఎండోమెంట్‌ బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు మొత్తం రెండు కాన్వొకేషన్లలో కలిపి 122 మంది విద్యార్థులకు 162 పతకాలు, 37 ఎండోమెంట్‌ బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు. ఇక డిగ్రీ సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమంలో భాగంగా 2024, 2025 విద్యా సంవత్సరాలకు సంబంధించిన పీహెచ్‌డీ, సూపర్‌ స్పెషాలిటీ, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తామన్నారు. వ్యక్తిగతంగా హాజరయ్యే వారిలో 8 మంది పీహెచ్‌డీ అభ్యర్థులు, ఒక సూపర్‌ స్పెషాలిటీ అభ్యర్థి, ఒక పోస్టు గ్రాడ్యుయేట్‌ అభ్యర్థి గైర్హాజరుగా డిగ్రీలు స్వీకరించనున్న వారిలో 3 మంది పీహెచ్‌డీ, 2 మంది పోస్టు గ్రాడ్యుయేట్‌ అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు.

Leave a Reply