అనంతగిరి అందాల్లో చిన్నారుల ప్రకృతి విహారం..

వికారాబాద్, ఆంధ్రప్రభ : అనంతగిరి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ విద్యార్థులు, చిన్నారులు అటవీ ప్రాంతంలో నిర్వహించిన నడకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బండ బాబా శ్రీ ఆంజనేయస్వామి ఆలయం నుంచి అనంతగిరి వరకు వారు నడక సాగించారు.
ఉదయ వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, పచ్చని ప్రకృతి మధ్య నడవడం తమకు ఎంతో ఉల్లాసాన్ని కలిగించిందని చిన్నారులు తెలిపారు. కాలుష్యానికి దూరంగా సహజసిద్ధమైన ప్రకృతి ఒడిలో ముందుకు సాగుతూ వారు ఆనందంగా గడిపారు.
నేటి యాంత్రిక జీవనశైలిలో స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం దొరకడం కష్టమవుతున్న నేపథ్యంలో అనంతగిరి అటవీ ప్రాంతంలో నిర్వహించిన ఈ ప్రకృతి నడక తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పాల్గొన్నవారు పేర్కొన్నారు.
ప్రకృతి సోయగాలకు నిలయమైన అనంతగిరి ప్రాంతానికి శని, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు, యాత్రికులు విచ్చేస్తుంటారు. పచ్చని అడవులు, ఆహ్లాదకరమైన వాతావరణం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
