జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

జిల్లా పరిషత్ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జి.వి. రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జి.వి. రమణారెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు, ప్రజానాయకుడు ఎన్టీఆర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే కష్టపడి చదువుకుంటూ, నటనపై అపారమైన ఆసక్తితో సినీరంగంలో ప్రవేశించి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పాత్రల ద్వారా ప్రజల మనసుల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి చలించిపోయిన ఎన్టీఆర్ ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసి ఆదర్శ నాయకుడిగా నిలిచారని కొనియాడారు. కష్టం, పట్టుదల, ప్రజాసేవ ఉంటే ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనే గొప్ప సందేశాన్ని ఎన్టీఆర్ జీవితం అందిస్తోందని వివరించారు.
కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా ఎస్‌జీఎస్‌డబ్ల్యూ అధికారి, కర్నూలు డీడీవో, కర్నూలు, వెల్దుర్తి ఎంపీడీవోలు, పరిపాలనాధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
