8th Day | కర్పూర కాంతుల్లో దివ్యక్షేత్రంలో వెలుగులు

8th Day | కర్పూర కాంతుల్లో దివ్యక్షేత్రంలో వెలుగులు
కాశీ పండితుల వేదఘోషల మధ్య భక్తి పరవశం
వైభవంగా కొనసాగుతున్న సరస్వతి పుష్కరోత్సవం
8th Day | మహదేవపూర్, ఆంధ్రప్రభ : సరస్వతీ అంత్య పుష్కరాల సందర్భంగా దక్షిణకాశీగా పేరుగాంచిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం గురువారం ఆధ్యాత్మిక వైభవంతో కళకళలాడింది. ఎనిమిదో రోజు తెల్లవారుజాము నుంచే వేలాదిమంది భక్తులు పవిత్ర త్రివేణి సంగమానికి చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించారు. వేదఘోషలు, శివనామస్మరణలు, హరహర మహాదేవ నినాదాలతో క్షేత్రమంతా భక్తిమయ వాతావరణంతో మారుమోగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరం చేరుకుని పవిత్ర సరస్వతీ జలాల్లో స్నానాలు ఆచరించి అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పితృతర్పణాలు, గోదానాలు, ప్రత్యేక మొక్కులు, చీరే సారే సమర్పణలతో ఘాట్ ప్రాంతమంతా భక్తి సంప్రదాయాలతో కళకళలాడింది. మరికొందరు భక్తులు నదీతీరంలోని ఇసుకతో సైకత శివలింగాలను నిర్మించి అభిషేకాలు, అర్చనలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు కుటుంబ సమేతంగా పాల్గొని శివనామస్మరణల మధ్య పూజలు నిర్వహించడంతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ప్రత్యేక అర్చనలు వైభవంగా కొనసాగాయి. వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేస్తున్న పీఠాధిపతులు, స్వామీజీలు, వేద పండితుల రాకతో కాళేశ్వరం క్షేత్రానికి మరింత దివ్యకాంతి చేకూరుతోంది.
8th Day | కాశీ నుంచి వచ్చిన వేద పండితులు..

గురువారం కాళేశ్వరంలోని ప్రసిద్ధ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో కాశీ నుంచి విచ్చేసిన ప్రత్యేక వేద పండితులచే “కర్పూర గౌర హారతి” కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి కర్పూర హారతులు సమర్పించగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక తరంగాలతో మారుమోగిపోయింది. శంఖనాదాలు, మంగళ వాయిద్యాలు, వేదఘోషల మధ్య జరిగిన ఈ కార్యక్రమం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. ఇక ప్రతి సాయంత్రం త్రివేణి సంగమం సరస్వతీ ఘాట్ వద్ద నిర్వహిస్తున్న నవరత్నమాల హారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాశీ గంగా హారతిని తలపించేలా దీపాల కాంతులతో వెలిగిపోతున్న ఘాట్ ప్రాంతం భక్తి లోకాన్ని తలపిస్తోంది. కాశీ నుంచి విచ్చేసిన వేద పండితులు స్వామివారిని దర్శించుకుని నవరత్నమాల హారతులు సమర్పించగా హారతి తిలకించేందుకు వేలాదిమంది భక్తులు ఘాట్ వద్దకు తరలివచ్చారు.

8th Day | హరికథలు, భజనలు..
అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో కాశీ పండితులను అర్చకులు శేష వస్త్రాలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజారులు ఫణీంద్ర శర్మ వేద పండితులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, క్యూలైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, షటిల్ బస్సులు, విశ్రాంతి కేంద్రాలు వంటి సదుపాయాలను అధికారులు సమర్థవంతంగా కల్పించారు. వివిధ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ భక్తులు క్రమశిక్షణతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని సూచించారు. శాంతి భద్రతలను పాటిస్తూ పుష్కర కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరికథలు, భజనలు, శైవభక్తి గీతాలు, జానపద కళారూపాలు పుష్కరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కళాకారుల ప్రదర్శనలతో కాళేశ్వరం క్షేత్రం సాంస్కృతిక వైభవాన్ని సంతరించుకుంది. సరస్వతీ అంత్య పుష్కరాల సందర్భంగా ప్రస్తుతం కాళేశ్వరం భక్తి, భవ్యం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా మారి తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతోంది.
CLICK HERE TO READ MORE : 1875 clusters | కేంద్రానికి వినతి
