భక్తిప్రపత్తులతో బక్రీద్

భక్తిప్రపత్తులతో బక్రీద్
ఘనంగా ఈద్-ఉల్-అధా ప్రార్థనలు
మహబూబాబాద్, ఆంధ్రప్రభ:
పవిత్ర ఈద్-ఉల్-అధా (బక్రీద్) పర్వదినాన్ని మహబూబాబాద్ జిల్లాలోని ముస్లిం సోదరులు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో ఉన్న పాత ఈద్గా, కంకర బోర్డు ప్రాంతంలోని కొత్త ఈద్గాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. చిన్నారుల నుండి వృద్ధుల వరకు అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఈద్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇమాంలు బక్రీద్ పర్వదిన విశిష్టతను వివరిస్తూ.. త్యాగం, మానవత్వం, సోదరభావం యొక్క గొప్పతనాన్ని ప్రబోధించారు. జిల్లా కేంద్రంతో పాటు పరిసర గ్రామాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ముస్లింలు ఈద్గాలకు తరలివచ్చారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ “ఈద్ ముబారక్” అని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఈద్గాలకు చేరుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ముస్లింలు పట్టణంలోని ఖబర్స్థాన్‌కు వెళ్లి, తమ పూర్వీకుల సమాధులపై పుష్పాలు ఉంచి నివాళులర్పించారు. తమ కుటుంబ సభ్యుల శాంతి, సౌభాగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బంధువులు, సన్నిహితుల ఇళ్లకు వెళ్లి మిఠాయిలు పంచుకుంటూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. భక్తి, ప్రేమ, సోదరభావాల సమ్మేళనంగా మహబూబాబాద్‌లో బక్రీద్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో ఘనంగా ముగిశాయి.

