రైతు వ్యతిరేక చర్యలపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆగ్రహం

రైతు వ్యతిరేక చర్యలపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆగ్రహం
చిలుపూర్, ఆంధ్రప్రభ:
చిలుపూర్ మండలంలోని లింగంపల్లి గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిశీలించిన ఆయన, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
కొనుగోలు కేంద్రంలో తాగునీరు, నీడ, రవాణా మరియు రాత్రిపూట విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అరిగోస పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందని, మిల్లర్లు అదనపు తూకాలు వేస్తూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గన్నీలు ఉంటే లారీలు రావడం లేదని, లారీలు వస్తే ధాన్యం దించుకోకపోవడం వంటి సమస్యలతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా మారిందని మండిపడ్డారు.
“వారం రోజుల్లో ఒక్క గింజ కూడా మిగలకుండా కొంటామని చెప్పి, ఇప్పుడు రైతులను మోసం చేస్తున్నారు” అని ఆయన విమర్శించారు. ఇదే సమయంలో కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన కాంగ్రెస్‌కు తొత్తుగా మారిపోయారని ఆరోపించారు. రైతు సమస్యలపై మాట్లాడకుండా, రూ. 1400 కోట్ల అంటూ ఫ్లెక్సీల రాజకీయాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. రాబోయే వారం రోజుల్లోపు ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయకపోతే, రైతులను కూడగట్టుకుని మహాధర్నా చేస్తామని డాక్టర్ రాజయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కంకటి రవిందర్, రచ్చ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
