మహాసమాధి దర్శించిన రాధికా దంపతులు..

పుట్టపర్తి, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి మహాసమాధిని ప్రముఖ సినీ నటి రాధిక శరత్ కుమార్ , నటుడు శరత్ కుమార్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. స్వామివారి మహాసమాధిని సందర్శించడం తమకు మహాభాగ్యంగా భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “స్వామివారు పిలిచారు కాబట్టే ఇక్కడికి వచ్చాము” అని భావోద్వేగంగా తెలిపారు. పుట్టపర్తికి ఇదే తొలిసారి రావడం జరిగిందని, ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ఎంతో విశిష్టంగా అనిపించిందన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే ఈ పవిత్రక్షేత్రంలో అడుగుపెట్టిన క్షణం నుంచే అపూర్వమైన ప్రశాంతత కలిగిందని చెప్పారు.

స్వామివారి మహాసమాధి వద్ద ధ్యానం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వారు ఆశ్రమ పరిసరాలను సందర్శించారు. అక్కడి నిశ్శబ్ద వాతావరణం, భక్తి భావన తమ హృదయాలను హత్తుకుందని తెలిపారు. ఈ దర్శనం జీవితంలో మరపురాని అనుభూతిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తరచూ పుట్టపర్తికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందే భాగ్యం కలగాలని కోరుకుంటున్నట్లు రాధికా శరత్‌కుమార్ దంపతులు వెల్లడించారు. స్థానిక భక్తులు, అభిమానులు వారిని ఆత్మీయంగా స్వాగతించారు.

Leave a Reply