టీడీపీ నాయకుడు టీవీఎస్ ప్రసాద్‌పై దాడి

టీడీపీ నాయకుడు టీవీఎస్ ప్రసాద్‌పై దాడి
పుత్తూరు, ఆంధ్రప్రభ : పుత్తూరు మండలంలోని చిన్నరాజు కుప్పంలో గురువారం ఉదయం కత్తి దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు, గతంలో 14వ వార్డు మాజీ కౌన్సిలర్ భర్త అయిన టీవీఎస్ ప్రసాద్ పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. గురువారం ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో టీవీఎస్ ప్రసాద్ తన పొలం వద్దకు వెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి కత్తితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ దాడిలో ప్రసాద్ కుడి చేతికి తీవ్ర గాయాలు కాగా, భారీగా రక్తస్రావం జరిగినట్లు తెలిసింది.
ఘటనను గమనించిన గ్రామ ప్రజలు వెంటనే స్పందించి బాధితుడిని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి గ్రామంలో జాతర నిర్వహించినట్లు తెలిసింది. జాతర అనంతరం జరిగిన ఈ దాడి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఘటనకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
