అసెంబ్లీ రద్దు చేసి ప్రజా తీర్పుకు సిద్ధమా?

అసెంబ్లీ రద్దు చేసి ప్రజా తీర్పుకు సిద్ధమా?

సీఎం రేవంత్‌కి మహేశ్వరరెడ్డి సవాల్

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ:
ప్రజాపాలన పేరుతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. ప్రజా విశ్వాసం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజా తీర్పుకు సిద్ధమవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు.

బుధవారం “రైతు గోస–బీజేపీ భరోసా” పేరుతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి చేపట్టిన బస్సు యాత్ర మూడో రోజు పెద్దపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా బీజేపీ బృందం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి రైతులతో మాట్లాడింది. ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు వారికి వివరించారు.

ఈ సందర్భంగా మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలతో పాటు 420 హామీల సంగతేంటని ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు.

రైతులు పండించిన పంటను అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కల్లాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో దళారుల పెత్తనం పెరిగి రైతులు మోసపోతున్నారని ఆరోపించారు.

90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లలో కోతల పేరుతో భారీగా అక్రమాలు జరిగాయని, రూ.2160 కోట్ల మేర దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ సొమ్ము ఎక్కడికి వెళ్తుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.