ప్రభుత్వ విద్యార్థులకు తొలి విమాన ప్రయాణం..
బోనకల్, ఆంధ్రప్రభ : పదో తరగతి ఫలితాల్లో ఖమ్మం జిల్లా, బోనకల్ మండల స్థాయిలో ర్యాంకులు సాధించిన ఇద్దరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విమానయాన సౌకర్యం కల్పిస్తానని మండలంలోని తూటికుంట్ల గ్రామానికి చెందిన ఊటుకూరి ఫౌండేషన్ సభ్యుడు ఊటుకూరి నాగేశ్వరరావు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.
విద్యార్థుల్లో చైతన్యం నింపాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారం, మే 11న మండలంలో తొలి రెండు ర్యాంకులు సాధించిన ఆళ్లపాడు, రావినూతల గ్రామాలకు చెందిన విద్యార్థులు టీ భాను ప్రకాష్, టీ చంద్రకళలను విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు విమానంలో తీసుకెళ్లి వారికి ప్రత్యేక అనుభూతిని కలిగించారు.

ఈ సందర్భంగా ఊటుకూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆశయాలు ఉన్నతంగా ఉంటే లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ విమానయానంలో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) దామాల పుల్లయ్య కూడా పాల్గొన్నారు.
విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా చైతన్యం కల్పించిన ఊటుకూరి ఫౌండేషన్ నిర్వాహకుడు నాగేశ్వరరావుకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
