స్త్రీలపై హింసను అరికట్టాలి

స్త్రీలపై హింసను అరికట్టాలి
- సఖి అవగాహన కార్యక్రమంలో చైర్ పర్సన్ పిలుపు
కేసముద్రం , ఆంధ్రప్రభ: బాలికలు, స్త్రీలపై జరిగే హింసను అరికట్టాలని, వారికి అండగా నిలవాలని కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత వెంకన్న, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రామ నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు.
బుధవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయం రైతు వేదికలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సఖి (బాలికలు, స్త్రీలపై) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ కుటుంబంలో గానీ, సమాజంలో గానీ మహిళలపై హింస లేదా వివక్ష జరిగితే వెంటనే స్పందించాలని సూచించారు. మహిళలు ఎటువంటి వేధింపులు ఎదుర్కొన్నా భయపడకుండా ముందుకు రావాలని, ప్రభుత్వమే వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
పోక్సో కేసులపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని తెలిపారు. మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని కోరారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.
మున్సిపాలిటీ తరఫున మహిళలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో క్రాంతి కుమారి, మహబూబాబాద్ జిల్లా సఖీ సభ్యురాలు శ్రావణి, వార్డు కౌన్సిలర్లు ఉమా, విజయ, డాక్టర్ స్పందన, లాయర్ ఉష, అంగన్వాడీ టీచర్లు, మున్సిపాలిటీ ఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు.
