రైతులకు అండగా ప్రభుత్వం

రైతులకు అండగా ప్రభుత్వం

  • ధాన్యం కొనుగోళ్లపై మంత్రి శ్రీధర్ బాబుకు రైతుల కృతజ్ఞతలు

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో మహాదేవపూర్ మండల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించడంతో వెంటనే సంబంధిత శాఖలు అప్రమత్తమై రైతులకు అవసరమైన ఏర్పాట్లు చేశాయి.

ఈ నేపథ్యంలో కాళేశ్వరం గ్రామానికి చెందిన యువ రైతు కోల మహేష్ మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంతో రైతులు ఆందోళనకు గురయ్యారని, అయితే మంత్రి స్పందించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పరిస్థితి పూర్తిగా మారిందన్నారు.

మంత్రి ఆదేశాల మేరకు అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించి రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని వేగంగా తూకం వేసి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతుల వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని మిల్లర్లకు తరలించే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. దీంతో రైతులు తమ ధాన్యం విక్రయంపై నెలకొన్న ఆందోళనల నుంచి ఉపశమనం పొందారు.

ఈ సందర్భంగా యువ రైతు కోల మహేష్ మాట్లాడుతూ, రైతుల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు రైతు పక్షపాతి నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కొనుగోలు నిర్వహిస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిపారు.

ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపు, తూకం, రవాణా ప్రక్రియలు వేగంగా కొనసాగుతున్నాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లో సానుకూల వాతావరణం నెలకొంది.

Leave a Reply