Mahanadu | 2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మ‌హా అవ‌కాశం

Mahanadu | 2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మ‌హా అవ‌కాశం

Mahanadu | ఇది మా సంకల్పం.. మా బాధ్యత.. మా కమిట్ మెంట్
మహానాడులో చారిత్రాత్మక తీర్మానం
ప్రవేశపెట్టిన యువనేత నారా లోకేష్
టైమ్, డేట్ ఫిక్స్ చేయండి… అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు రెడీ
ఆఫ్‌లైన్, హైబ్రిడ్ మోడలైనా.. టీమ్ 11కి బ్యాటింగ్ తప్పదు
మ‌హానాడు వేదిక‌పై వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్

అమరావతి, ఆంధ్రప్రభ:

Mahanadu | ‘‘పార్లమెంట్‌లో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి.. మన స్త్రీశక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే దానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. ఇప్పుడు ఒక ప్రతిపాదన చేస్తున్నాను. పార్లమెంట్‌లో బిల్ పాస్ అయినా, అవ్వకపోయినా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి.. వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకు ఇవ్వాలి.. ఈ పవిత్ర మహానాడు వేదిక నుండి నేను ఈ ప్రతిపాదన చేస్తున్నా’’ అని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ అన్నారు. లోకేష్ ప్రవేశపెట్టిన చారిత్మాత్మక తీర్మానంతో మహానాడు వేదిక మారుమోగింది. మహానాడు ప్రారంభం సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33% సీట్లను కేటాయించాలి. ఇది కేవలం ఒక నినాదంగా కాదు.. భారతదేశ భవిష్యత్తు పట్ల ఒక నిబద్ధతగా ఉండాలి. మాకు మరింత మంది మహిళా చట్టసభ సభ్యులు కావాలి.. మరింత మంది మహిళా నాయకులు కావాలి.. మరింత మంది మహిళా విధాన నిర్ణేతలు కావాలి. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును మహిళలు భుజం భుజం కలిపి నడిపిస్తారు. ఇది మా సంకల్పం… ఇది మా బాధ్యత.. .ఇది మా కమిట్ మెంట్ అన్నారు.

మహిళా సాధికారతను టీడీపీ విశ్వసిస్తోంది

భారత రాజకీయాల తదుపరి శకం మహిళా నాయకత్వానిదే కావాలని నేను గట్టిగా నమ్ముతున్నాను. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం ద్వారా ఎన్డీయే ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. మా దృక్పథం స్పష్టం— మహిళలు కేవలం లబ్ధిదారులుగా మాత్రమే మిగిలిపోకూడదు.. మహిళలు నిర్ణయాలు తీసుకునేవారుగా మారాలి. దురదృష్టవశాత్తు, ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తిరస్కరించి, మహిళా సాధికారతకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించాయి. ఎన్నికల సమయంలో చాలా పార్టీలు మహిళా సాధికారత గురించి మాట్లాడతాయి. ఎన్నికల తర్వాత మహిళలను మర్చిపోతాయి. కానీ తెలుగుదేశం పార్టీ సూత్రప్రాయంగా, ఆచరణలో మహిళా సాధికారతను విశ్వసిస్తోంది. ఇతరులు మద్దతిచ్చినా, మద్దతు ఇవ్వకపోయినా.. పార్లమెంట్ అమలు చేసినా చేయకపోయినా.. మనం ముందుండి నడిపించాలని ప్రతిపాదిస్తున్నాను. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. కొంతమంది మహిళలను అవమానపరిచేలా మాటలు మాట్లాడతారు. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు అంటూ తక్కువచేసి మాట్లాడతారు. అలాంటి మాటలు ఎవరూ మాట్లాడకూడదని ముందుండి పోరాడాలి. స్కూల్ బుక్స్ లో ఇంటి పనులు చేసే బొమ్మలు అన్నీ మహిళలవే ఉంటే 50 – 50 ఉండాలని ఆదేశించాను.

హైబ్రిడ్ అయినా టీమ్ -11 కి బ్యాటింగ్ తప్పదు

ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా, హైబ్రిడ్ అయినా మహానాడు మాస్ జాతర సూపర్ హిట్. పసుపు పండుగ మహానాడు. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి — నేను తెలుగు వాడినీ… నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే వేదిక మహానాడు. నేషన్ ఫస్ట్ తెలుగుదేశం పార్టీ విధానం. మన దేశం – మన బాధ్యత. ప్రధాని మోదీ గారు ఇచ్చిన దిశ మనం ఫాలో అవుతున్నాం. నెల్లూరులో భారీగా మహానాడు నిర్వహించాలి అనుకున్నాం. ప్రత్యేక పరిస్థితుల్లో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తున్నాం. మనమే హైబ్రిడ్ మోడల్ అనగానే టీమ్ 11 సంబరాలు చేసుకున్నారంటా. ఆఫ్‌లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11 కి బ్యాటింగ్ తప్పదు.

లెజెండ్.. అన్న ఎన్టీఆర్!

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు దేశానికి లెజెండ్. తెలుగువారి ఆత్మ గౌరవం, తెలుగు వారి పౌరుషం ఎన్టీఆర్. సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ ఆయన ట్రెండ్ ఫాలో అవ్వలేదు.. ట్రెండ్ సెట్ చేశారు. ఆయన రికార్డులు బద్దలు కొట్టడం ఎవరివల్లా సాధ్యం కాదు. దేశానికి సంక్షేమం, అభివృద్ధి పరిచయం చేసింది ఎన్టీఆర్. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని చెప్పిన మాట మన సిద్ధాంతం. 2 రూపాయలకు కిలో బియ్యం, పెన్షన్, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ళు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకం, పటేల్‑పట్వారీ విధానం రద్దు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు వంటివి ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. స్త్రీశక్తిని మొదట గుర్తించింది, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది, మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీ పెట్టింది, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చింది అన్న ఎన్టీఆర్.

సీబీఎన్ పేరు చెబితే ప్రపంచవ్యాప్తంగా గౌరవం

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మూడు అక్షరాలు చెబితే గౌరవం దక్కుతుంది. ఆ మూడు అక్షరాల బ్రాండ్ సిబిఎన్… ఈ సౌండ్ తాడేపల్లి ప్యాలస్‌కు వినపడాలి.. టీమ్ 11 టీవీలో మహానాడు చూస్తుంది. ఒక్కరితో అయితే పోటీ పడగలం.. కానీ ఆయనలో 25 ఏళ్ళ కుర్రాళ్లు ముగ్గురు ఉన్నారు. ఆయన జెట్ స్పీడ్‌లో వెళ్తుంటారు. ఆయన స్పీడ్ అందుకోవడానికి మనం కష్టపడుతున్నాం. అప్పుడు కియా…ఇప్పుడు ఫైటర్ జెట్స్. అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐ. అప్పుడు హైటెక్ సిటీ.. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ. అప్పుడు సైబరాబాద్… ఇప్పుడు అమరావతి. భవిష్యత్తును ముందుగానే చూసే విజనరీ మా లీడర్ సిబిఎన్. స్త్రీశక్తిని మహా శక్తిగా మార్చింది మన సిబిఎన్. మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చింది మన సిబిఎన్. ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే వారికి లాస్ట్ డేట్ అని చెప్పిన దమ్మున్న నాయకుడు సిబిఎన్ అని నారా లోకేష్​ ఉద్వేగంగా ప్రసంగించారు.

CLICK HERE TO READ క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితా వివరాలను పరిశీలించిన కలెక్టర్

CLICK HERE TO READ MORE

Leave a Reply