తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ఎమ్మార్పీఎస్ టీఎస్
టేకుమట్ల, ఆంధ్రప్రభ: అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి, మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తడిసిన ధాన్యాన్ని రక్షించేందుకు కొనుగోలు కేంద్రాల్లో కనీసం టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవని విమర్శించారు. గన్ని సంచుల కొరతతో పాటు సెంటర్ ఇన్‌చార్జిల నిర్లక్ష్యం కారణంగా ధాన్యం ఇప్పటికీ కల్లాల వద్దే నిలిచిపోయిందని అన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నెలకొన్న సమస్యలతో రైతులు అనేక అవస్థలు పడుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఆరోపించారు.
ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకుని తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఎలుకటి రాజయ్య మాదిగ కోరారు.
