పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ బ్యూరో: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాల అమలు జరగాలని స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ధర్మసాగర్ మండలానికి చెందిన 26 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.26,03,016 విలువగల చెక్కులను, అలాగే 39 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) లబ్ధిదారులకు రూ.14,25,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. వీటితో పాటు ధర్మసాగర్ కేంద్రానికి చెందిన భూక్య వసంత అనే మహిళ అనారోగ్య ఖర్చుల నిమిత్తం రూ.2,50,000 విలువైన ఎల్ఓసీ పత్రాన్ని, ముప్పారం గ్రామంలో రెండు అంగన్వాడీ భవనాల నిర్మాణ మంజూరు పత్రాన్ని స్థానిక సర్పంచ్‌కు అందజేశారు.
అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా అందుతున్న రూ.1,00,116 ఆర్థిక సహాయం తల్లిదండ్రులకు కొండంత భరోసానిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలో రైతు, మహిళా, పేద వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
రాష్ట్రంపై అప్పుల భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. కల్యాణ లక్ష్మి లబ్ధిదారులు పెళ్లి కాగానే దరఖాస్తు చేసుకోవాలని, అధికారుల నుంచి మూడు నెలల్లో ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ వంటి ఏ పథకానికైనా ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, దళారులను నమ్మవద్దని స్పష్టం చేశారు. విధుల్లో అవినీతికి పాల్పడే అధికారులను సహించేది లేదని హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక నిధులతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
