TDP Mahanadu 2026 | మహానాడుతో టీడీపీ కొత్త చరిత్ర

TDP Mahanadu 2026 | మహానాడుతో టీడీపీ కొత్త చరిత్ర
TDP Mahanadu 2026 | 1,848 క్లస్టర్లతో డిజిటల్ అనుసంధానం
లోకేష్ మార్క్ డిజిటల్ విప్లవం
రెండేళ్ల విజయాలు.. మూడేళ్ల దిశానిర్దేశం
TDP Mahanadu 2026 | అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక ఉత్సవం మహానాడు ఈసారి సరికొత్త డిజిటల్ చరిత్రకు వేదిక కానుంది. హైబ్రిడ్ విధానంలో ఈ వేడుకను నిర్వహించేందుకు పార్టీ సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ ఈసారి నిర్వహించే మహానాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కబోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 1,875 క్లస్టర్లలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుతో అనుసంధానం కాబోతున్నారని పేర్కొన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లను మంత్రులు పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సవితతో కలిసి మంగళవారం పరిశీలించారు. మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ మహానాడు నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,848 క్లస్టర్లకు డిజిటల్ సాంకేతికత ద్వారా అనుసంధానించి, లక్షలాది మంది కార్యకర్తలను భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు.
• ఎన్టీఆర్ భవన్ నుంచి నేరుగా క్లస్టర్లకు..
• 1,848 క్లస్టర్లతో డిజిటల్ పసుపు పండుగ
• లక్షలాది తమ్ముళ్లను కలిపే మహానాడు
• 20 తీర్మానాలకు పార్టీ సిద్ధం
• ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
• వివరాలు వెల్లడించిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
లోకేష్ మార్క్.. డిజిటల్ విప్లవం
ఈ హైబ్రిడ్ మహానాడు ఆలోచన వెనుక పార్టీ యువ నాయకుడు, హార్వర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నారా లోకేష్ దార్శనికత ఉందని పల్లా తెలిపారు. ఆయన అనుభవం, సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగుదేశం పార్టీని డిజిటల్ యుగంలోకి నడిపిస్తున్నారని కొనియాడారు. సుమారు రెండు వేల క్లస్టర్ల ద్వారా లక్షలాది మంది కార్యకర్తలను ఏకకాలంలో అనుసంధానించడం ఒక ప్రాంతీయ పార్టీకి రికార్డు అని, ఇది దేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.
రెండేళ్ల విజయాలు..
మూడేళ్ల దిశానిర్దేశం: మంత్రి పయ్యావుల
ప్రభుత్వం రెండేళ్ల పాలనా విజయాలను ఈ వేదికగా చాటడంతో పాటు, వచ్చే మూడేళ్లలో రాష్ట్ర భవిష్యత్తు, యువత, రైతుల కోసం ఏం చేయబోతున్నామనే దిశానిర్దేశాన్ని సీఎం చంద్రబాబు వివరించనున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. యువనేత నారా లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి జరుగుతున్న మహానాడు ఇదన్నారు. ఆయన అనుభవంతో సుమారు 2 వేల క్లస్టర్ల రీచ్ దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించేలా ఈ హైబ్రిడ్ మహానాడును డిజిటల్ శకంలోకి నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో పరిమిత సంఖ్యలో అగ్రనేతలతో భౌతికంగా మహానాడు జరుగుతుందని, దీనికి అనుసంధానంగా రాష్ట్రవ్యాప్తంగా 1,848 క్లస్టర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా కేంద్ర కార్యాలయ వేదికను అనుసంధానించి కార్యకర్తలను నేరుగా ఉత్సవంలో భాగస్వాములను చేయనున్నారని వివరించారు. మహిళా సాధికారతతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే ధ్యేయంగా తీర్మానాలు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.
హైబ్రిడ్ మహానాడు ఇలా..
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు, నారా లోకేష్ సహా ముఖ్య నేతలు పరిమిత సంఖ్యలో భౌతికంగా పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 1,848 క్లస్టర్ల వద్ద భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, కేంద్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ప్రతి క్లస్టర్ నుంచి ఎంపిక చేసిన కార్యకర్తలు, నేతలు నేరుగా చంద్రబాబు, లోకేష్‌తో మాట్లాడే అవకాశం కల్పిస్తారు.
