Nandamuri Taraka Rama Rao | రాజకీయాల్లో కొత్త శకం

Nandamuri Taraka Rama Rao | రాజకీయాల్లో కొత్త శకం
Nandamuri Taraka Rama Rao | తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం..
సంక్షేమ పాలనతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర
బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన ఎన్టీఆర్
జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల శక్తిని చాటిన మహానేత
Nandamuri Taraka Rama Rao | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఓ సునామీ. తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదం నేపథ్యంలో నాలుగు దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 1982 మార్చి 29న అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై తెలుగుదేశం పార్టీ తెరపైకి వచ్చింది. అయితే అప్పటివరకు తెలుగువారికి ప్రత్యేక గుర్తింపు లేదు. దేశంలో ఎక్కడకు వెళ్లినా “మద్రాసీలు” అనే పిలిచేవారు. తెలుగుజాతి అంటూ ఒకటున్నది అనే సంగతి కూడా ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితుల్లో మద్రాసీలుగా పిలిపించుకున్న తెలుగువారికి జాతీయస్థాయిలో ఒక గుర్తింపు వచ్చింది కేవలం నందమూరి తారక రామారావుతోనే.
ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రక అవసరం. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలుగుదేశం పార్టీ స్థాపన తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆయన సుడిగాలి పర్యటన చేశారు. కాగా పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారానికి వచ్చి చరిత్రను తిరగరాసిన ఘనతను సొంతం చేసుకుంది తెలుగుదేశం పార్టీ.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించే నాటికే రాష్ట్రంలో ఎటుచూసినా కాంగ్రెస్ వ్యతిరేకత నెలకొంది. 1981లో అప్పటి ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. ప్రతిపక్షాలు బలపరచిన జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి సజ్జా చంద్రమౌళి విజయం సాధించారు. 1981లో అటు విశాఖ, ఇటు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. విశాఖ తొలి మేయర్‌గా ఎన్ఎస్ఎన్ రెడ్డి ఎన్నికయ్యారు. అలాగే విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించింది. విజయవాడ తొలి మేయర్‌గా సీపీఐ సీనియర్ నాయకుడు టి. వెంకటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు.

ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ను ఓడించడమే పనిగా పెట్టుకున్నారు తెలుగు ప్రజలు. అయితే వరుస ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించలేదు. పైపెచ్చు ఎన్టీఆర్ పర్యటనలకు వస్తున్న స్పందనను సినిమా గ్లామర్ అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు.
ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఎన్టీఆర్ శకం!
1983 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో రాజకీయాల్లో ఎన్టీఆర్ శకం ప్రారంభమైంది. అదే ఏడాది జనవరి తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి కూడా ఎన్టీఆరే కావడం మరో విశేషం.
సంక్షేమాంధ్రకు నిలువెత్తు చిరునామాగా నిలిచింది తారక రాముడి పాలన. పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టడమే తమ ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమని ఎన్టీఆర్ భావించారు. ఈ ఆలోచనే రెండు రూపాయలకు కిలో బియ్యం పథకానికి నాంది పలికింది.
ఒక్కో కుటుంబానికి పాతిక కిలోల చొప్పున కోట్లాది కుటుంబాలకు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు. ఈ పథకం ఎన్టీఆర్‌కు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. కోట్లాది మంది పేదోళ్ల గుండెల్లో చెరగని స్థానం కల్పించింది. ఇలా ఒకటా, రెండా అనేక సంక్షేమ పథకాలకు తారక రాముడు ఆద్యుడయ్యారు.
సంక్షేమ పథకాలతో పాటు పాలనా సంస్కరణల్లో కూడా కొత్త శకానికి ఎన్టీఆరే ఆద్యుడిగా మారారు. తెలంగాణ ప్రజలకు తరతరాలుగా నిరంకుశత్వం రుచి చూపించిన పటేల్, పట్వారీల వ్యవస్థను రూపుమాపారు. పటేళ్ల ఉక్కు సంకెళ్ల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించిన ఘనత సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. పాలనలో వికేంద్రీకరణకు ఆయన పెద్దపీట వేశారు. దీంతో తాలూకాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మండల వ్యవస్థ కొత్తగా అమల్లోకి వచ్చింది.
దేశంలోనే తొలిసారిగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు ఎన్టీఆర్. నాసిరకంగా పేదలకు ఇళ్లు కట్టే పద్ధతికి భరతవాక్యం పలికారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేదలకు సగం ధరకు జనతా వస్త్రాల పంపిణీ కూడా తారక రాముడి హయాంలోనే ప్రారంభమైంది. పేద వర్గాల వారికి ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను నెలకొల్పారు. పాలనా వ్యవస్థలో ఎన్టీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు ఇప్పటికీ చిరస్మరణీయం.
బీసీలను వెన్నుతట్టి ప్రోత్సహించిన ఎన్టీఆర్
తెలుగుదేశం పార్టీ వచ్చేంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సామాజికవర్గం హవాయే నడిచింది. ఈ హవాకు నందమూరి తారక రామారావు బ్రేకులు వేశారు. రాజకీయాల్లో వెనుకబడిన తరగతులను ఎన్టీఆర్ ప్రోత్సహించారు. తారకరాముడి హయాంలో పెద్ద సంఖ్యలో వెనుకబడిన తరగతుల నాయకులు కీలక పదవుల్లోకి వచ్చారు. ఇవాళ్టి రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీలు నిర్ణయాత్మక శక్తిగా మారారంటే దాని వెనుక ఎన్టీఆర్ ఉన్నారనేది వాస్తవం.
ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీగా పాపులర్ అయింది. ఎన్టీఆర్ ఏం చేసినా సంచలనమే. అప్పటి వరకు ముఖ్యమంత్రులు రాజ్ భవన్లో ప్రమాణస్వీకారం చేయడం ఆనవాయితీగా ఉండేది. కాలం చెల్లిన ఈ ఆనవాయితీని ఎన్టీఆర్ గట్టు మీద పెట్టారు. అధికారాన్ని ఇచ్చిన ప్రజల సమక్షంలో లాల్‌బహదూర్ స్టేడియంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపైన, గవర్నర్ల వ్యవస్థపైన ప్రశ్నలు సంధించిన ఘనత కూడా ఎన్టీఆర్కే సొంతం. ఎన్టీఆర్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన నాయకుడు కాదు. ఒక దశలో జాతీయ స్థాయిలోనూ తారక రాముడు తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెసేతర జాతీయ పార్టీల నాయకులను ఒకతాటిపైకి తీసుకువచ్చి నేషనల్ ఫ్రంట్ ఆవిర్భావంలో ఆయన కీలకపాత్ర పోషించారు.
లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ
జాతీయస్థాయి రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల శక్తిని చాటిన మహానేత నందమూరి తారక రామారావు. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతా సానుభూతి పవనాలు వీచాయి. దీంతో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎన్టీఆర్ ప్రభంజనం వీచింది. అప్పటి మొత్తం 42 లోక్‌సభ నియోజకవర్గాలలో 35 సీట్లు గెలుచుకుని టీడీపీ రికార్డు సృష్టించింది. అప్పట్లో లోక్‌సభలో టీడీపీయే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.
ఆ తరువాత జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు ఎన్టీఆర్ కేంద్ర బిందువు అయ్యారు. ఎన్టీఆర్ ఆధ్వర్యంలోనే నేషనల్ ఫ్రంట్ ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ మూడు సార్లు అధికారంలోకి తెచ్చారు. మహానాడు పేరుతో ప్రతి ఏడాది పార్టీ మహాసభలు నిర్వహించడాన్ని ఎన్టీఆరే ప్రారంభించారు. ఆ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.
సమాజమే దేవాలయంగా, ప్రజలే దేవుళ్లుగా రాజకీయాల్లో కొనసాగారు ఎన్టీఆర్. ప్రజా జీవనంలో సచ్చీలతకు, విలువలకు ఎన్టీఆర్ పెద్దపీట వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై నందమూరి తారక రాముడిది చెరగని ముద్ర.
— ఎస్. అబ్దుల్ ఖాలిక్
6300174320
