రైల్వే స్టేషన్‌లో రక్తపోటు స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమం

రైల్వే స్టేషన్‌లో రక్తపోటు స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమం

రక్తపోటు నియంత్రణతో అకాల మరణాలను తగ్గించవచ్చని వైద్యుల సూచన

చిత్తూరు, ఆంధ్రప్రభ : ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు రైల్వే స్టేషన్‌లో మంగళవారం రక్తపోటు నివారణ వారోత్సవాల సందర్భంగా స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్‌సీడీ కోఆర్డినేటర్ డాక్టర్ గిరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు, సిబ్బందికి రక్తపోటు పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. అలాగే అధిక రక్తపోటు వల్ల కలిగే ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

డాక్టర్ గిరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 17న ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక రక్తపోటు అనేది గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండ సమస్యలు వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే “సైలెంట్ కిల్లర్” అని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి, ముందస్తుగా గుర్తించి నివారించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని వివరించారు.

ప్రస్తుత జీవనశైలి మార్పులు, మానసిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా యువతలో కూడా రక్తపోటు సమస్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ రక్తపోటు పరిమితి 120/80 mmHgగా ఉంటుందని తెలిపారు. రక్తపోటు నియంత్రణకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, ఉప్పు వినియోగం తగ్గించడం, నిత్య వ్యాయామం, యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు.

ఈ అంశాలపై గ్రామీణ స్థాయి వరకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎపిడెమియాలజిస్ట్ శ్రీవాణి, సూపర్వైజర్ మురళి, తన్వి, లావణ్య, గోపి, సుందర్, హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply