ప్రజల చైతన్యమే లక్ష్యంగా సిద్దేశ్వరం అలుగు మహాసభ

ప్రజల చైతన్యమే లక్ష్యంగా సిద్దేశ్వరం అలుగు మహాసభ
ప్రజా శంకుస్థాపన 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ సాగునీటి సమస్యల పరిష్కారం, ప్రాంత సమగ్రాభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 10వ వార్షికోత్సవ మహాసభ ఈ నెల 31న ఘనంగా నిర్వహించనున్నట్లు రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు తెలిపారు.
మంగళవారం సమితి కార్యాలయంలో జరిగిన సమావేశంలో 2016 మే 31న జరిగిన ప్రజా శంకుస్థాపన ఉద్యమానికి సంబంధించిన వీడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కృష్ణా, తుంగభద్ర నదులు రాయలసీమ గుండా ప్రవహిస్తున్నప్పటికీ ప్రాంతం ఇప్పటికీ కరువుతో సహజీవనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణమే రాయలసీమ సమగ్రాభివృద్ధికి మార్గమని వారు స్పష్టం చేశారు.
ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో 2016లో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రజా శంకుస్థాపన నిర్వహించారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వార్షికోత్సవ కార్యక్రమాల ద్వారా సాగునీటి సమస్యలపై ప్రజాస్వామ్య ఒత్తిడి కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 31న జరిగే మహాసభకు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గోపాలగౌడ, ఏపీ రైతు కూలీ సంఘం అధ్యక్షురాలు ఝాన్సీ, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ఆచార్యులు వెంకటేష్ తదితరులు హాజరై సందేశాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
రాయలసీమ సాగునీటి సమస్యలు, ప్రాంత అభివృద్ధిపై ప్రజల్లో అవగాహన కల్పించే ఈ మహాసభలో రైతులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం, ప్రతిపక్షాలు రాయలసీమ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శిస్తూ ప్రజలే చైతన్యవంతమై తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు యర్రం శంకర్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు, బెక్కం రామసుబ్బారెడ్డి, న్యాయవాది అసదుల్లా తదితరులు పాల్గొన్నారు.
