మత్తుపై ఉక్కుపాదం.. రంగంలోకి దిగిన పోలీస్ బృందాలు

కేసముద్రం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆదేశాల మేరకు యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు కేసముద్రం పోలీస్ బృందంతో ప్రత్యేక కూంబింగ్, తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. కేసముద్రం ఎస్సైలు క్రాంతి కిరణ్, నరేష్ ల ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ “మ్యాక్స్”, డాగ్ హ్యాండ్లర్ శివరాజ్, పోలీస్ సిబ్బంది కలిసి గ్రామ శివారు ప్రాంతాలు, చెట్ల పొదలు, నిర్మానుష్య ప్రదేశాలు, రైల్వే ట్రాక్ పరిసరాలు, యువత గుమికూడే ప్రాంతాలు , గంజాయి సేవిస్తున్నట్లు అనుమానిత ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.శబరీష్ ఆదేశాల మేరకు ఎస్సై క్రాంతి కిరణ్ మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయి. క్షణిక ఆనందం కోసం భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలి. యువత చదువు, ఉద్యోగం, క్రీడలు, మంచి లక్ష్యాల వైపు అడుగులు వేయాలి.
సేవించిన .. విక్రయించిన చట్టపరమైన చర్యలు తప్పవు…
గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే ఈ నెంబర్ కు 8712656999 సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు . కేసముద్రం పరిధిలో మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, గంజాయి సేవిస్తూ లేదా విక్రయిస్తూ పట్టుబడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి…
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి కుటుంబ సభ్యుల ఆశలను నిలబెట్టాలని సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మత్తు పదార్థాల నిర్మూలన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని, గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ డాగ్ మ్యాక్స్, డాగ్ హ్యాండ్లర్ శివరాజ్ , కేసముద్రం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
