ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్

ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్

నగర పరిశుభ్రతకు ప్రజల సహకారం అభినందనీయం : కమిషనర్ ధ్యానచంద్ర

కార్పొరేషన్, ఆంధ్రప్రభ : ప్రజల భాగస్వామ్యంతో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.

మంగళవారం నగరంలోని సూర్యారావుపేట, గవర్నరపేట, భవానిపురం స్వాతి థియేటర్ సెంటర్, హెచ్‌బీ కాలనీ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. భవానిపురం స్వాతి థియేటర్ సమీపంలోని ఎంపీ దాస్ వీధిలో నిర్వహించిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజల సహకారంతో విజయవంతంగా సాగుతోందన్నారు. నగరంలోని 64 డివిజన్లలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, టెర్రస్ గార్డెన్ గ్రూపులు చురుకుగా పాల్గొంటూ పారిశుధ్య కార్మికులకు చేయూతనందిస్తున్నాయని తెలిపారు.

నగర పరిశుభ్రత పెంపునకు తమ వంతు బాధ్యతగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. పారిశుధ్య కార్మికుల శ్రమను తగ్గించే దిశగా ప్రజలు ముందుకు రావడం సంతోషకరమన్నారు.

అనంతరం హెచ్‌బీ కాలనీలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి వసతులు, కూలర్లు, క్యూ లైన్ల వద్ద ఏర్పాటు చేసిన షెడ్లు తదితర సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

నోడల్ అధికారులు ప్రతిరోజూ అన్న క్యాంటీన్లను తనిఖీ చేస్తూ ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు సమర్థవంతంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె. శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply