స్వచ్ఛ ఏపీ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి

స్వచ్ఛ ఏపీ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో గద్దె క్రాంతి కుమార్ పిలుపు
పటమట, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ పరిసరాలను శుభ్రపరిచే చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు.
మంగళవారం ఎన్‌ఎస్‌ఎం స్కూల్ సమీపంలో స్పృహాప్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో గద్దె క్రాంతి కుమార్ పాల్గొని స్థానిక వీధుల్లో చెత్తను చీపుర్లతో ఊడ్చి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛమైన సమాజ నిర్మాణానికి ప్రజలంతా కలిసి పనిచేయాలని అన్నారు.
ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి క్లాత్ బ్యాగ్‌లను వినియోగించాలని కోరారు. “మన ఇల్లు – మన ప్రాంతం – మన బాధ్యత” అనే భావనతో ముందుకు రావాలని తెలిపారు.
పరిశుభ్రతను మన నుంచే ప్రారంభిస్తేనే సమాజంలో మార్పు వస్తుందని పేర్కొన్నారు. శుభ్రతే ఆరోగ్యానికి మొదటి మెట్టు అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితేనే ఆరోగ్యంగా ఉండగలుగుతామని అన్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే ఆంధ్రప్రదేశ్ మరింత స్వచ్ఛంగా మారుతుందని తెలిపారు.
చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. సచివాలయాల వారీగా అధికారులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు సమన్వయంతో పనిచేస్తే ప్రతి కాలనీ, ప్రతి వీధి పరిశుభ్రంగా మారుతుందని అన్నారు.
ప్రతి ఇంటి వద్ద తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, చెట్ల పెంపకంతోనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని తెలిపారు.
స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మాత్రమే కాకుండా ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని గద్దె క్రాంతి కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్పృహాప్తి ట్రస్ట్ సభ్యులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో ముమ్మనేని ప్రసాద్, వీరంకి భారతి దేవి, టి. మాధురి, డి. పద్మ, కర్ణ రమేష్, నూతి శ్రీనివాస్, సత్యనారాయణ, పద్మలత, బాలకృష్ణ, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
