వంటగ్యాస్ సంక్షోభంపై క్యాప్కో ఆందోళన…

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా వంటగ్యాస్ ( ఎల్పిజి ) సరఫరా, ధరల పెరుగుదల మరియు బ్లాక్ మార్కెట్ సమస్యలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య ( క్యాప్కో ) చైర్మన్ జి. సురేష్ కుమార్ హెచ్చరించారు. ఇటీవల నిర్వహించిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో ఆయన వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఎల్పిజి సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత కనిపిస్తోందని, బుకింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు ఏర్పడుతున్నాయని చెప్పారు. సరఫరా ఆలస్యమవుతుందనే భయంతో వినియోగదారులు ముందుగానే సిలిండర్లు నిల్వ చేసుకుంటుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందన్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు గ్యాస్ సిలిండర్లు విక్రయిస్తున్నారని క్యాప్కో ఆరోపించింది. సామాన్య ప్రజలు అధిక ధరలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాలు ఈ సంక్షోభంతో ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని వివరించింది.
ఆర్.టి.ఐ ద్వారా వెలుగులోకి వచ్చిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని జి. సురేష్ కుమార్ తెలిపారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ సేకరించిన సమాచారం ప్రకారం, దేశంలోని ఇండియన్ ఆయిల్ ( ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం ( బిపిసిఎల్ ), హిందుస్థాన్ పెట్రోలియం ( హెచ్పీసీఎల్ ) సంస్థలకు కలిపి సుమారు 33.95 కోట్ల ఎల్పిజి కనెక్షన్లు ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 3.30 కోట్ల కుటుంబాలు ఒక్కసారి కూడా ఎల్పిజి రీఫిల్ చేయించుకోలేదన్నారు. మరో 2.26 కోట్ల కుటుంబాలు కేవలం ఒక్కసారే సిలిండర్ తీసుకున్నాయని చెప్పారు.
ఇండియన్ ఆయిల్ సంస్థలోనే 2.03 కోట్ల మంది వినియోగదారులు కనీస వినియోగానికి పరిమితమయ్యారని, భారత్ పెట్రోలియంలో 1.25 కోట్ల మంది, హిందుస్థాన్ పెట్రోలియంలో 1.26 కోట్ల మంది వినియోగదారులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. పేదలకు స్వచ్ఛమైన వంట ఇంధనం అందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో కూడా వినియోగం తగ్గిపోవడం ఆందోళనకరమన్నారు. సబ్సిడీలు ఉన్నప్పటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కుటుంబాల ఆర్థిక ఇబ్బందుల కారణంగా గ్యాస్ రీఫిల్ చేయించుకోవడం కష్టమవుతోందని చెప్పారు.
ఫలితంగా అనేక కుటుంబాలు మళ్లీ కట్టెల పొయ్యిలు, బొగ్గు వంటి సంప్రదాయ ఇంధనాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ కమిటీ తక్షణ చర్యలు తీసుకోవాలని క్యాప్కో డిమాండ్ చేసింది. ముఖ్యంగా గ్యాస్ బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేయడం, సరఫరా లోపాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టడం, గ్రామీణ మరియు పేద కుటుంబాలకు తక్షణ ఉపశమనం కల్పించడం, ఉజ్వల లబ్ధిదారులకు అదనపు సబ్సిడీ అందించడం వంటి చర్యలు అవసరమని సూచించింది. అలాగే ప్రతి డిస్ట్రిబ్యూటర్ వద్ద స్టాక్, సరఫరా వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, బుకింగ్ తర్వాత డెలివరీ ఆలస్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని క్యాప్కో ప్రతిపాదించింది. వంటగ్యాస్ ఇప్పుడు ప్రతి కుటుంబానికి ప్రాథమిక అవసరమైందని, ధరల పెరుగుదల, సరఫరా లోపాలు, బ్లాక్ మార్కెట్ వంటి సమస్యలు ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని జి. సురేష్ కుమార్ పేర్కొన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు సమన్వయంతో అత్యవసర చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
