కేకే కమిటీతో ప్రత్యేక సమావేశానికి భారీగా తరలిరావాలి..

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం, నిజమైన ఉద్యమకారుల గుర్తింపునకు ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్న “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజినీకాంత్ పిలుపునిచ్చారు.

ఉద్యమకారుల ఫోరం కృషి ఫలితంగానే కేకే కమిటీ ఏర్పాటు జరిగిందని ఆయన పేర్కొన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఫోరం నిరంతరంగా పోరాటం చేస్తోందని తెలిపారు.

తెలంగాణ కోసం త్యాగాలు చేసిన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమంలో ఆర్థికంగా నష్టపోయిన వారు, జైలు జీవితం అనుభవించిన వారు, ఎఫ్‌ఐఆర్‌లు, బైండోవర్ కేసులు ఎదుర్కొన్న వారి చరిత్రను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యమకారుల జీవితాలతో ఆటలాడితే ఫోరం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు ఎవరివి, భోగాలు ఎవరివో ఉద్యమకారులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమకారుల ఫోరం కొనసాగుతుందని తెలిపారు.

ఈ నెల 31న హైదరాబాద్‌లో కేకే కమిటీ చైర్మన్ కె. కేశవరావు, ఇతర సభ్యులతో ఉద్యమకారుల ఫోరం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర కమిటీ బాధ్యులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నందగిరి రజినీకాంత్ కోరారు.

Leave a Reply