భూ హక్కుల సమస్యల పరిష్కారానికి వేగం..

భూ హక్కుల సమస్యల పరిష్కారానికి వేగం..
చుక్కల భూములు, 22ఏ కేసులపై ప్రత్యేక డ్రైవ్
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో చుక్కల భూములు (డాటెడ్ ల్యాండ్స్) మరియు 22ఏ నిషేధిత జాబితాకు సంబంధించిన సమస్యలను పారదర్శకంగా, చట్టబద్ధంగా, వేగవంతంగా పరిష్కరిస్తున్నామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.
సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనంతరం 16 మంది లబ్ధిదారులకు ల్యాండ్ ప్రొసీడింగ్స్ పత్రాలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అందజేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ 22ఏ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి మొదటి విడతలో 111, రెండో విడతలో 56 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. వెబ్‌ల్యాండ్ రికార్డులను సరిచేసి, అవసరమైన చోట పట్టా భూములుగా క్రమబద్ధీకరించి 22ఏ జాబితా నుంచి తొలగించినట్లు చెప్పారు.
చుక్కల భూములపై మాట్లాడుతూ, సంబంధిత భూమి ప్రభుత్వ భూమి కాదని, రహదారి లేదా పోరంబోకు కాదని నిర్ధారణ అయిన తర్వాతే జాబితా నుంచి తొలగింపు చేపడుతున్నట్లు తెలిపారు. 2017 చట్టం ప్రకారం 2005 నుంచి భూమి ఆధీనంలో ఉన్నట్లు నిరూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1927లో బ్రిటిష్ కాలంలో రూపొందించిన సెటిల్‌మెంట్ రిజిస్టర్‌లో కొన్ని పట్టా భూములు పొరపాటున గవర్నమెంట్ డ్రైగా నమోదై చుక్కలు పెట్టబడినట్లు కలెక్టర్ వివరించారు. అయితే జీపీగా నమోదైన భూములు ప్రభుత్వ పోరంబోకు భూములేనని స్పష్టం చేశారు.
జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, ఆర్‌డీఓ, తహసీల్దార్, ఏడీ సర్వే, జిల్లా రిజిస్ట్రార్ సభ్యులుగా ప్రత్యేక కమిటీ పనిచేస్తోందని తెలిపారు. అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాతే ప్రొసీడింగ్స్ జారీ చేస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం మరో 16 దరఖాస్తులను క్లియర్ చేసి పత్రాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పెండింగ్ కేసులను కూడా వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కుటుంబ ఆస్తి వివాదాలు, భూ పంపకాల సమస్యల్లో రెవెన్యూ, పోలీసు శాఖలు జోక్యం చేసుకోరాదని చట్టం స్పష్టం చేస్తోందని కలెక్టర్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి కుటుంబ సభ్యులు పరస్పర అవగాహనతో ముందుకు రావాలని సూచించారు.
ఈ సందర్భంగా చక్రవర్తులపల్లె గ్రామానికి చెందిన జేసీ కే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ డాటెడ్ ల్యాండ్ సమస్య వేగంగా పరిష్కరించినందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
