క్షణాల్లో మారిన జీవితం.. విషాదంలో కుటుంబం

భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : హెవీ వాటర్ ప్లాంట్ (భారజల కర్మాగారం)లో సైంటిఫిక్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ప్రభాత్ కుమార్ (38) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన అశ్వాపురం మండలం గౌతమినగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.

పాల్వంచలోని నవభారత్ సమీపంలో, ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఎదురుగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రభాత్ కుమార్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రభాత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు, సహోద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.