Murder | ప్రియుడితో కలిసి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన భార్య

Murder | ప్రియుడితో కలిసి మృతదేహాన్ని పూడ్చిపెట్టిన భార్య
Murder | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి, మృతదేహాన్ని జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపుతోంది.
నారాయణఖేడ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి(36) భార్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. అతని భార్య కల్పనకు ఎల్గోయి గైని పండరి అలియాస్ చింటూతో కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఈనెల 16న ప్రియుడితో కలిసి ముత్యంరెడ్డిని హత్య చేసినట్లు విచారణలో తేలింది.
హత్య అనంతరం చనిపోయిన తన సోదరుడికి సమాధి కట్టిస్తున్నామని చెప్పి.. గ్రామ శివారులోని పొలంలో జేసీబీతో గుంత తవ్వించి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు సమాచారం. అనంతరం ఈనెల 18న భర్త కనిపించడం లేదంటూ కల్పన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కల్పనను అనుమానించి ప్రశ్నించగా.. ప్రియుడితో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో పోలీసులు 9 రోజుల అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
