Indian students abroad | కరుగుతున్న డాలర్ డ్రీమ్స్.. చీకట్లో భవిష్యత్తు

Indian students abroad | కరుగుతున్న డాలర్ డ్రీమ్స్.. చీకట్లో భవిష్యత్తు

Indian students abroad | విదేశాల్లో భారతీయ విద్యార్థులపై రూపాయి పతనం ప్రభావం
ఒక్కపూట భోజనంతోనే గడుపుతున్న విద్యార్థుల దుస్థితి
విద్యారుణాలు, పెరిగిన ఖర్చులతో కుటుంబాల ఆందోళన
తగ్గుతున్న గ్రేడ్ పాయింట్లు.. మానసిక ఒత్తిడిలో యువత

Indian students abroad | న్యూఢిల్లీ: మన రూపాయి రోజు రోజుకీ బక్కచిక్కిపోతోంది. డాలర్‌తో మారకం విలువ మరింతగా క్షీణిస్తోంది. ఇప్పటికే 96 మార్కును దాటి, సెంచరీ వైపు పరుగులు తీస్తోంది. ఈ పరిస్థితి దేశీయంగా పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోంది. ధరల పెరుగుదలతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు మరింత ప్రాణసంకటంగా మారింది. పడిపోతున్న రూపాయి కారణంగా పస్తులు ఉండాల్సిన దుస్థితి తలెత్తుతోంది.

‘లండన్‌లో 8 పౌండ్ల శాండ్విచ్ చెత్తబుట్టలో పడేయడానికి కొన్ని గంటల ముందు మాత్రమే సరసమైన ధరలో లభిస్తుంది. “టూ గుడ్ టు గో” యాప్ దానిని 2.5 నుంచి 3 పౌండ్లకు అమ్ముతుంది. గడువు ముగుస్తున్న ఆహారం కోసం మేము (విద్యార్థులం) దుకాణానికి పరుగెత్తాలి. నేను సమయానికి వెళ్లకపోతే, వేరొకరు దానిని తీసుకుంటారు. లండన్‌లో దాదాపు మూడు నెలలు నేను ఈ విధంగానే నా కడుపు నింపుకున్నాను’ అని కింగ్స్ కాలేజ్ లండన్ నుంచి తన మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చిన మాన్వి కోలి చెప్పారు.

అప్పట్లో రూపాయి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 93 మార్కును దాటింది. ప్రస్తుతం ఇది 96 మార్కును దాటింది. ఏ క్షణమైనా 100 మార్కును తాకవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితి విదేశాల్లోని భారతీయ విద్యార్థుల బ్రతుకును దుర్భరంగా మార్చేస్తోంది. కనీస జీవనం కోసం అధికారిక పార్ట్‌టైమ్ షిఫ్టులతో పాటు డిపార్ట్‌మెంట్ స్టోర్లు, రైల్వే స్టేషన్లలో నేల తుడవడం వంటి చిల్లర పనులు చేయాల్సి వస్తోంది. విదేశాల్లో ఒక భారతీయ విద్యార్థి జీవితపు వాస్తవికత రాయితీలు, రేషన్ పంపిణీలు, జాగ్రత్తగా పంచుకునే కిరాణా బిల్లుల రూపంలో ఉంటుంది. చాలామంది ప్రజా రవాణా లేదా ఖరీదైన క్యాబ్ ప్రయాణాలకు డబ్బు చెల్లించే బదులు సుదూర ప్రాంతాలకు నడిచి వెళ్లడానికే ఇష్టపడతారు.

గొప్పగా చూపించే దానికి విరుద్ధంగా, ఈ కష్టతరమైన జీవనశైలులే ప్రతి పౌండు, డాలర్‌కు (రూపాయికి కూడా) మూల్యం చెల్లించేలా చేస్తున్నాయి. భోజనం మానేస్తూ, నిరంతరం బ్రతుకు పోరాటం చేస్తుంటే చదువు సాగేదెలా? ఈ ఆకలి పోరాటం విద్యార్థుల బరువులోనే కాకుండా, వారి గ్రేడ్లనూ ప్రభావితం చేస్తోంది.

కేవలం యూకేలోనే కాకుండా యూఎస్‌లోని విశ్వవిద్యాలయాల్లో కూడా తన కజిన్, స్నేహితులతో సహా అనేక మంది విద్యార్థులు “టూ గుడ్ టు గో” వంటి యాప్లు అందించే డిస్కౌంట్లపైనే ఆధారపడుతున్నారని మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన కోలి గుర్తుచేసుకున్నారు. విదేశీ చదువులకు వచ్చిన ప్రతిఒక్కరూ సంపన్నులు కారు. కొందరు విద్యా రుణాలపై వస్తారు. మరికొందరు స్కాలర్‌షిప్‌పై ఆధారపడతారు. అలాగే, విదేశీ డిగ్రీల కోసం వారి తల్లిదండ్రులు ఇళ్లను తాకట్టు పెట్టినవారు కూడా ఉంటారు.

“నేను లండన్ వచ్చినప్పుడు అమెరికన్ డాలర్ విలువ సుమారు రూ.85 ఉండేది. ఇప్పుడు రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. 2009 నుంచి దాని విలువలో సగానికి పైగా కోల్పోయింది” అని కోలి చెప్పారు.

రుణాలు టాప్‌టాప్..

విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు రూపాయి కష్టాలు తక్షణ ప్రభావం చూపుతున్నాయి. చదువులకు నిధులు సమకూర్చే తల్లిదండ్రులకు విదేశాలకు డబ్బు పంపే ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుంది. వారు ఇప్పుడు ఒక డాలర్ లేదా ఒక పౌండ్ కోసం ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక విద్యారుణాలతో విదేశాలకు వచ్చిన వారి బడ్జెట్ తల్లకిందులవుతోంది.

రెండు, మూడేళ్ల కిందట చదువుకోసం సిద్ధం చేసుకున్న బడ్జెట్ ఇప్పుడు ఒక్కసారిగా 30 శాతం పెరగడంతో నాలుగో సెమిస్టర్‌కే ముందే జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో చదువును కొనసాగించడానికి టాప్‌అప్ రుణాలే శరణ్యంగా మారుతున్నాయి. ఇలా ఒకవైపు చదువుల భారం, మరోవైపు అప్పుల తిప్పలతో భారతీయుల డాలర్ డ్రీమ్స్, పౌండ్ డ్రీమ్స్ వేగంగా కరిగిపోతున్నాయి. “బాబోయ్ రూపాయ్” అంటూ విలపించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఉన్నత చదువుల కోసం అందరిలాగే సతీష్ కూడా అమెరికా వెళ్లాడు. చిన్న విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో చోటు సంపాదించాడు. అక్కడికి వెళ్లి రెండేళ్లు అయింది. కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. మొదటి సంవత్సరం అంతా సంతోషంగానే గడిచింది. నాన్న ఇచ్చిన డబ్బు, స్కాలర్‌షిప్ కలిపి ఖర్చులకు సరిపోయేవి.

కానీ గతేడాది నుంచి రూపాయి విలువతోపాటు తన బతుకుబండి కూడా గాడితప్పింది. తగినంత డబ్బు లేక రోజుకు ఒక్కపూట భోజనంతో సరిపెట్టేస్తున్నాడు. ఉదయం కాఫీ తాగి, మధ్యాహ్నం లైబ్రరీలో ఉండిపోయి, రాత్రి ఒక్క రైస్ బౌల్ లేదా రెండు చపాతీలతో బతికేస్తున్నాడు. మొదట్లో శరీరం సహించింది. కానీ నెమ్మదిగా తల తిరగడం, ఏకాగ్రత తగ్గడం, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు మొదలయ్యాయి. క్లాస్‌లో ప్రొఫెసర్ చెప్పే పాఠాలు బుర్రకు ఎక్కడం లేదు. అసైన్‌మెంట్లు సకాలంలో చేయలేకపోతున్నాడు. గత సెమిస్టర్‌లో 3.7 గ్రేడ్ పాయింట్లు సాధించగా, ఇప్పుడు 2.9కి పడిపోయింది.

“ఏంట్రా అలా ఉన్నావ్?” అని తన రూమ్‌మేట్ విక్రమ్ అడిగాడు. “మన రూపాయి పడిపోతుంటే, మనం బలహీనంగా కాక తప్పదు” అని సతీష్ బదులిచ్చాడు. విక్రమ్ మౌనంగా ఉండిపోయాడు. అతనికీ అదే సమస్య. ఇద్దరూ కలిసి కొన్ని రోజులు రెడీమేడ్ నూడుల్స్, బనానా, పీనట్ బట్టర్‌తోనే గడిపేవాళ్లు. కానీ అది కూడా ఖరీదైపోయింది.

ఒక రోజు లైబ్రరీలో తల పట్టుకుని కూర్చున్న సతీష్‌ను భారతీయురాలైన ఓ సీనియర్ విద్యార్థిని గమనించింది. “ఏంటి బ్రో? గ్రేడ్స్ పడిపోతున్నాయంట. స్కాలర్‌షిప్ కోసం అప్లై చేయ్. పార్ట్‌టైమ్ జాబ్ చూడు. ఇలా ఆకలితో చదివితే ఏం వస్తుంది?” అని సలహా ఇచ్చింది.

ఆ రాత్రి రాహుల్ తన రూమ్‌లో కూర్చుని ఏడ్చాడు. టెక్ కంపెనీలో ఉద్యోగం సాధించి కుటుంబాన్ని ఆదుకోవాలనే రాహుల్ స్వప్నాలు ఆకలి బాధలో కరిగిపోతున్నాయి. ఇది ఒక్క రాహుల్ కథ కాదు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాల్లో వేలాది మంది భారతీయ విద్యార్థులు ఇదే బాధను ఎదుర్కొంటున్నారు. బలహీనమైన రూపాయి వారి స్వప్నాలను కూడా బలహీనం చేస్తోంది. కొందరు మధ్యలోనే దేశానికి తిరిగి వస్తున్నారు. ఇంకొందరు ఆరోగ్యం పాడై, గ్రేడ్స్ పడిపోయి స్కాలర్‌షిప్ కోల్పోతున్నారు.

Leave a Reply