ఉదయం భానుడి భగ భగలు..

ఉదయం భానుడి భగ భగలు..

సాయంత్రం ప్రకృతి ప్రతీకారం…
46 డిగ్రీల పైన ఉష్ణోగ్రతతో ఉక్కిరిబిక్కిరైన జిల్లా
వడగాలులతో విలవిలలాడిన ప్రజలు..
నిర్మానుష్యమైన రహదారులు
సాయంత్రం భీకర ఈదురు గాలులు, ఉరుములు-మెరుపులతో భారీ వర్షం
నేలకొరిగిన ఫ్లెక్సీలు..
విద్యుత్ అంతరాయం..
అరగంట వర్షంతో ఊపిరి పీల్చుకున్న నగరం..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ప్రజలు ఒకే రోజులో రెండు విభిన్న వాతావరణ విపత్తులను చవిచూశారు. ఆదివారం ఉదయం నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ మండుటెండలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయంత్రానికి ఒక్కసారిగా ప్రకృతి రూపం మార్చుకుని భీకర ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిపించింది. ఉదయం అగ్నిగుండంలా మండిన జిల్లా.. సాయంత్రానికి గాలివాన బీభత్సంతో అతలాకుతలమైంది. తీవ్ర ఎండలు, వడగాలులు, ఆ తర్వాత గాలివానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అత్యధిక ఉష్ణోగ్రతలు..

జిల్లాలో ఆదివారం అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 7 గంటలకే 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో భానుడి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమైంది. ఉదయం 9 గంటలకల్లా ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. అత్యవసర పనులు మినహా ప్రజలు బయటకు రావడానికి సాహసం చేయలేదు. వేడి గాలులు నడిరోడ్డుపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా పరిస్థితిని సృష్టించాయి. వడగాలుల తీవ్రత కారణంగా ద్విచక్ర వాహనదారులు, చిరు వ్యాపారులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.రాత్రి 7 గంటల వరకు వేడి గాలుల ప్రభావం కొనసాగింది. ఎండ తీవ్రతతో విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఐస్ క్రీమ్ పార్లర్లు, చల్లని పానీయాల దుకాణాలు, కొబ్బరి బోండాల వ్యాపారాలకు భారీగా డిమాండ్ పెరిగింది. మరోవైపు ఆస్పత్రుల్లో వడదెబ్బ, డీహైడ్రేషన్ బాధితుల సంఖ్య కూడా పెరిగినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.

ఒక్కసారిగా మారిన వాతావరణం…

అయితే సాయంత్రం 6 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈశాన్య దిశ నుంచి దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో నగరంపై భీకర ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని వణికించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి నీరు చేరింది. ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగులు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు విరిగి రహదారులపై పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు దెబ్బతినడంతో సరఫరా నిలిచిపోయింది. వర్షం సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు రోడ్ల పక్కన ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు అరగంట పాటు కురిసిన వర్షంతో నగరవాసులు మండుటెండల నుంచి కాస్త ఉపశమనం పొందారు. అయితే ఉత్తర దిశ నుంచి వీస్తున్న వేడి గాలుల ప్రభావం మాత్రం రాత్రి వరకు కొనసాగింది. వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వాతావరణ నిపుణుల అభిప్రాయం ప్రకారం, తీవ్ర ఉష్ణోగ్రతలు, ఉపరితల వేడి కారణంగా వాతావరణ అస్థిరత పెరిగి ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply