After2019Elections | పెద్ద‌.. చాన్స్ మిస్ !

After2019Elections | పెద్ద‌.. చాన్స్ మిస్ !

After2019Elections | జనసేనతో కొనసాగి ఉంటే వాళ్ల‌కే రాజ్యసభకు అవ‌కాశం
పార్టీ వీడిన తోట చంద్రశేఖర్, రామ్మోహన రావు, జేడీ లక్ష్మీనారాయణ,
పార్థసారథి, ముత్తంశెట్టి కృష్ణారావు , ముద్రగడ పద్మనాభం
ఇప్పుడు పార్టీలో ఉంటే పెద్ద‌ల స‌భ‌కు వెళ్లే అవకాశం
2024 ఎన్నికల సమయంలో దూరమైన హరిరామ జోగయ్య
దూరదృష్టితో పవన్ కళ్యాణ్ వెన్నంటి నడవలేకపోయారు
నమ్మి వెంట నడిచిన వాళ్లందరికీ ప్రాధాన్యమిచ్చిన జనసేనాని

After2019Elections | అమ‌రావ‌తి,ఆంధ్ర‌ప్ర‌భ : ‘వ్యూహం నాకు వదిలేయండి’ – ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల తరవాత నాయకులకు, శ్రేణులకు బలంగా చెప్పిన మాట. రాజకీయ వ్యూహాన్ని రచిస్తాను, అధికారంలో స్థానం పొందే దిశగా నడిపిస్తాను అని పవన్ చెప్పిన మాటను దూరదృష్టితో చూడలేక – ఆయనతో ప్రయాణాన్ని మధ్యలోనే విడిచిపెట్టిన నాయకులు ఒక విధంగా చింతించే పరిస్థితి ఉంది. రాజ్యసభకు ఆంధ్ర ప్రదేశ్ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ నాలుగింటిలో ఒకటి కచ్చితంగా జనసేనదే.

జనసేన నుంచి రాజ్యసభ గడప తొక్కేది ఎవరు?
జనసేనాని చెప్పిన ‘వ్యూహం నాకు వదిలేయండి’ అనే మాటను బలంగా విశ్వసించి ఆయనతో ఉండి ఉంటే – కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్, రామ్మోహన రావు, జేడీ లక్ష్మీనారాయణ, చింతల పార్థసారథి, ముత్తంశెట్టి కృష్ణారావుల్లో ఎవరో ఒకరి పేరు బలంగా ముందు ఉండేది. తోట, జేడీ, పార్థసారధి, ముత్తంశెట్టి 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి తరవాత పవన్ కళ్యాణ్ వెంట బలంగా నిలబడలేకపోయారు. నిలబడలేదు సరికదా ఆయనతో విబేధించో, మరో కారణం చూపించో జనసేనను విడిచిపెట్టారు. జేడీ అయితే మరీ విచిత్రమైన కారణం చెప్పి పార్టీ వదిలేశారు.

పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అనే సిల్లీ కారణం చూపించారు. ఆ తరవాత జై భారత్ నేషనల్ పార్టీ పెట్టారు. ఇక తోట, పార్థసారథి బీఆర్‌ఎస్‌లో చేరారు. రిటైర్డ్ ఐ.ఎ.ఎస్. అధికారి, తమిళనాడులో జయలలిత హయాంలో చీఫ్ సెక్రటరీగా పని చేసిన పి.రామ్మోహనరావు కూడా పవన్ కళ్యాణ్ వెంట నడవలేదు. సివిల్ సర్వెంట్స్ గా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని తోట చంద్రశేఖర్, జేడీ లక్ష్మీనారాయణ, పి.రామ్మోహనరావు, చింతల పార్థసారధిల్లో ఎవరో ఒకరిని పెద్దల సభకు వెళ్లేవారిలో ముందు ఉండేవారు. వారంతా కాపు సామాజిక వర్గంవాళ్లు కావడం కూడా ఒక అదనపు అర్హత అయ్యేది.

ముద్రగడ అనుభవమూ కలిసొచ్చేది
కాపు సామాజిక వర్గంలో సీనియర్ నాయకుడు రాష్ట్ర మంత్రిగా, ఎంపీ అనుభవం ఉన్న ముద్రగడ పద్మనాభం అనవసరపు వ్యాఖ్యానాలు, పవన్ కళ్యాణ్ పట్ల అసందర్భ విమర్శలు చేయకుండా ఉండి ఉంటే ఆయన పేరును కూడా తటస్తుల కోటాలో పవన్ కళ్యాణ్ పరిశీలన చేసి ఉండేవారు. కానీ వైసీపీలో చేరక ముందు నుంచీ పవన్ కళ్యాణ్ పై సందర్భం లేకపోయినా ఏదొక విమర్శ చేస్తూ జన సైనికుల సహనాన్ని పరీక్షించారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకొంటాను అని సవాల్ విసిరి అటు కులంలోనూ, ఇటు ప్రజల్లోనూ పలుచన అయ్యారు.

ఇక మాజీ చేగొండి హరిరామజోగయ్య సీనియారిటీకి అమిత గౌరవం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యేవారు. జనసేన నాయకులు సైతం ఆయన మాటకు గౌరవం ఇచ్చేవారు. కూటమి తరఫున జనసేన క్రియాశీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో చేగొండి హరిరామజోగయ్య సైతం తన వైఖరిని మార్చుకొన్నారు. సీనియర్లుగా ముద్రగడ, చేగొండి కూడా జనసేన పక్షాన కీలక స్థానాలకు వెళ్లేవారు. ఇక ముత్తంశెట్టి కృష్ణారావు కావచ్చు, మాదాసు గంగాధరం కావచ్చు జనసేనాని వెంట సుదీర్ఘ ప్రయాణానికి మానసికంగా సిద్ధం కాలేక పార్టీకి దూరమైపోయారు. మాదాసు వైసీపీలో చేరారు.

నమ్మినవాళ్లను విడిచిపెట్టని నైజం పవన్ సొంతం
పార్టీ కోసం, తన కోసం వెన్నంటి ఉండి నమ్మిన వాళ్ల‌ను… పార్టీ ఓడిపోయినా పార్టీపట్ల అభిమానంతో నిలబడ్డవారిని పవన్ కళ్యాణ్ విడిచిపెట్టలేదు. వారికి రాజకీయ భవిష్యత్తు, గౌరవం కల్పించారు. ఈ విషయంలో కులమతాలు చూడలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక జనసేన కోటాలో దక్కిన ఎమ్మెల్సీ పదవిని పిడుగు హరిప్రసాద్ కి ఇచ్చారు. ఆయన పార్టీ మీడియా హెడ్‌గా, అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శిగా ఆయన వెన్నంటి ఉంటూ చేసిన సేవలకు దక్కిన గుర్తింపు. శాసన మండలి విప్ బాధ్యతలూ అప్పగించారు.

పార్టీ కోశాధికారిగా వ్యవహరిస్తున్న ఎ.వి.రత్నం ఎప్పుడూ పదవి కోరుకోలేదు. వృత్తిరీత్యా ఆడిటర్ అయిన రత్నం రాజకీయ పదవులు కోరుకోకపోయినా ఆయన చేసిన సేవలను గుర్తించారు. రత్నం సతీమణి అనుగోలు రంగశ్రీని టీటీడీ. బోర్డు సభ్యురాలిగా నామినేట్ చేశారు. అదే బోర్డులో సభ్యుడైన బి మహేందర్ రెడ్డి ప్రజా రాజ్యం సమయం నుంచి పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉన్నారు. తొలి నుంచి తనతో ఉన్న ఆనంద సాయి సైతం టీటీడీ బోర్డు సభ్యుడయ్యారు. ప్రజా రాజ్యం సమయం నుంచి తన కలసి నడిచిన షేక్ రియాజ్ ను ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ గా, శంకర్ గౌడ్ ను టీటీడీ లోకల్ టెంపుల్ (హిమాయత్ నగర్) చైర్మెన్ గా నియమింపచేశారు.

2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనా పార్టీ కోసం నిలబడిన ఎస్సీ యువకుడు డా.పెదపూడి విజయ్ కుమార్ మాల కార్పొరేషన్ ఛైర్మన్ గా, వేగుళ్ల‌ లీలాకృష్ణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా, వంపూరు గంగులయ్య జానపద కళలు, సృజనాత్మక అకాడెమీ ఛైర్మన్ గా, పాలవలస యశస్వి తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా, పార్టీ కోసం పని చేసిన డా. హరిప్రసాద్, చిల్లపల్లి శ్రీనివాస్, కళ్యాణం శివ శ్రీనివాస్, కనకరాజు సూరిలకు ఛైర్మన్ పదవులు దక్కాయి. అంద‌రికీ స‌ముచిత స్థానాలు తన వెంట ఉన్నవారికి రాజ్యాంగబద్ధమైన పదవులు ఇచ్చి వారికి సముచిత స్థానం ఇచ్చారు.

2019 ఎన్నికలకు ముందు నుంచి పార్టీ కార్యాలయంలో ఉంటూ మీడియా వ్యవహారాలు చూసిన ఉద్యోగి చక్రవర్తికి రాజ్యాంగబద్ధమైన పదవి దక్కింది. ఆర్టీఐ కమిషనర్ గా చక్రవర్తి నియమితులయ్యారు. న చైల్డ్ రైట్స్ కమిషన్ లో పార్టీ కోసం పోరాడి దెబ్బలు తిన్న నాగమానస, ఎస్సీ కమిషన్ లో పార్టీ డాక్టర్స్ సెల్ లో పని చేసిన డా.గౌతమ్ రాజు, ఎస్టీ కమిషన్ లో గిరిజన ప్రాంతంలో పార్టీ స్థానిక నేత కడ్రక మల్లేశ్వరరావులకు స్థానం దక్కింది. పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన డా.కోటంరాజు శరత్, పార్టీ ఐటీ విభాగంలో సేవలందించిన పెన్నమనీడి నాగబాబులకు పదవులు దక్కాయి.

కూటమి ప్రభుత్వంలో ముఖమైన నామినేటెడ్ పదవులు పొందినవారి జాబితా పరిశీలిస్తే – 2019కి ముందు నుంచి, అప్పటి ఎన్నికల తరవాత తనను నమ్మి పార్టీతో నడిచిన వారికి సముచితమైన పదవులు, గౌరవ దక్కేలా చేశారు పవన్ కళ్యాణ్. ఇందులో కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, బీసీ, ఎస్టీ, ముస్లిం… ఇలా అన్ని కులాలు, మతాలవారు ఉన్నారు. ఈ గణాంకాలు పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ చెప్పిన ‘వ్యూహం నాకు వదిలేయండి’ అనే మాటను విశ్వసించకుండా బయటకు వెళ్లిపోయారు. వారికి దక్కాల్సిన స్థానాలు కచ్చితంగా పార్టీతో కలసి నడిచిన వారితోనే భర్తీ అవుతాయి. జనసేనతో ఉంటే తోట, జేడీ, పార్థసారధి, రామ్మోహనరావు, ముత్తంశెట్టి, మాదాసులకే సందర్భాన్ని బట్టి… ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఛైర్మన్, రాజ్యసభ పీఠాలు దక్కి ఉండేవి అనేది వాస్త‌వం..

click here to read నిరుద్యోగంపై దేశవ్యాప్తంగా చర్చ

click here to read more

Leave a Reply