అర్ధరాత్రి ఆపరేషన్..
అర్ధరాత్రి ఆపరేషన్..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతా వాతావరణం బలోపేతం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా ‘కార్డెన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్లు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు.
ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల నియంత్రణ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల ఇళ్ల పరిసరాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని మోటార్ సైకిళ్లు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారాయి, అక్రమ మద్యం పట్టుకుని కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రేగడగూడూరు, నందికొట్కూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షికారిపేట, సుండిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడి తండా, జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని తుడిచెర్ల గ్రామం, ఎన్. రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతమ్మతండా గ్రామాల్లో ప్రత్యేక బలగాలతో తనిఖీలు నిర్వహించారు.
ప్రతి ఇల్లు, వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. ప్రజల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
ముఖ్యంగా యువత భవిష్యత్తును దెబ్బతీసే డ్రగ్స్, గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే డయల్ 112, 100 నంబర్లకు లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ తనిఖీల్లో సంబంధిత ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
