ఎండలో వెళ్లిన అడుగు.. ఇంటికి చేరేసరికి విషాదం

ఖిలా వరంగల్, ఆంధ్రప్రభ కూలి పనికి వెళ్లిన వ్యక్తి వడదెబ్బతో మృతిచెందిన ఘటన శనివారం సాయంత్రం వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

నగరంలోని 42వ డివిజన్ రంగశాయిపేటకు చెందిన తోటకూర బుచ్చి కొమురయ్య (65) ప్రతిరోజులాగే శనివారం కూడా కూలి పనికి వెళ్లాడు. తీవ్ర ఎండలో పని చేసిన అనంతరం సాయంత్రం ఇంటికి చేరుకున్న ఆయన, ఒంట్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పిన కొద్దిసేపటికే కుప్పకూలి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.

మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బుచ్చి కొమురయ్యకు బీపీ, షుగర్ లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఏవీ లేవని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

రోజువారీ కూలి పనితో జీవనం సాగిస్తున్న ఈ నిరుపేద కుటుంబం పెద్దదిక్కును కోల్పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకుని ఆర్థిక సహాయం అందించాలని వారు కోరుతున్నారు.

Leave a Reply