US Green Card Rules | గ్రీన్‌కార్డు ప్రక్రియలో పెరుగుతున్న అనిశ్చితి

US Green Card Rules | గ్రీన్‌కార్డు ప్రక్రియలో పెరుగుతున్న అనిశ్చితి

US Green Card Rules | ఉద్యోగాల కోతలతో టెక్కీలపై తీవ్ర ప్రభావం
కుటుంబాల భవిష్యత్తుపై పెరుగుతున్న ఆందోళనలు
కెనడా, యూరప్ వైపు మొగ్గు చూపుతున్న టెక్కీలు
విద్యార్థుల అమెరికా కలపై తాజా నిబంధనల ప్రభావం
హెచ్-1బీ వీసాల్లో భారతీయుల ఆధిపత్యం

US Green Card Rules | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో శాశ్వత నివాసం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న వేలాది మంది భారతీయులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు అమెరికా విధించిన నిబంధనలు నిరాశను మిగుల్చుతున్నాయి. గ్రీన్‌కార్డు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో సమస్యలు మరింత పెరుగుతున్నాయి.

గ్రీన్‌కార్డు దరఖాస్తులపై ఆంక్షలు

వెంటనే అమెరికాను వీడాలని, తరువాత మళ్లీ సరైన వలస వీసాతో రావాలని అమెరికా అధికారులు విధిస్తున్న ఆంక్షలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై కఠిన నిబంధనలు, ఉద్యోగాల కోతలు, కృత్రిమ మేధస్సు ప్రభావంతో ఉద్యోగావకాశాలు భారీగా తగ్గిపోవడంతో భారతీయ టెక్కీలు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పుడు గ్రీన్‌కార్డు ప్రక్రియపైనా అనిశ్చితి పెరగడం తెలుగు కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది.

అమెరికాలో లక్షలాది మంది భారతీయులు ఉద్యోగ ఆధారిత వీసాలపై పనిచేస్తున్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణులే ఉన్నారు. చాలా మంది హెచ్-1బీ వీసాతో అమెరికాకు వెళ్లి, తరువాత శాశ్వత నివాస హక్కు కోసం గ్రీన్‌కార్డు దరఖాస్తు చేసుకుంటారు. అయితే భారతీయుల సంఖ్య అధికంగా ఉండటంతో గ్రీన్‌కార్డు కోసం వేచి చూడాల్సిన కాలం పదేళ్లు దాటుతోంది. కొందరికైతే ఇరవై ఏళ్ల పాటు నిరీక్షణ తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఈ మధ్యకాలంలో అమెరికా సంస్థల్లో ఉద్యోగాల కోతలు భారీగా పెరిగాయి. ఉద్యోగం కోల్పోయిన తర్వాత మరో ఉద్యోగం దొరకడానికి పరిమిత గడువు మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో కొత్త ఉద్యోగం లభ్యం కాకపోతే అమెరికా విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో అమెరికాలో అక్రమంగా ఉండకుండా వెంటనే స్వదేశానికి వెళ్లి, తరువాత సరైన వలస వీసాతో తిరిగి రావాలని అమెరికా అధికారులు ఆదేశించడం మరింత ఆందోళనకు దారితీసింది.

కుటుంబాల భవిష్యత్ ప్రశ్నార్థకం

మొదటగా కుటుంబాల భవిష్యత్తుపై అనిశ్చితి పెరుగుతోంది. అమెరికాలో చదువుకుంటున్న పిల్లలు, అక్కడే ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు అకస్మాత్తుగా దేశం విడిచి రావాల్సి వస్తే, వారి జీవిత ప్రణాళికలు దెబ్బతింటాయి. ఇళ్ల కొనుగోళ్లు, రుణాలు, పిల్లల విద్య అన్నీ సమస్యల్లో పడే ప్రమాదం ఉంది. ఉద్యోగ భద్రతపై ఒత్తిడి మరింత పెరుగుతోంది.

శాశ్వత నివాసం కోసం అమెరికాను ఆశ్రయించిన టెక్కీలు ఇప్పుడు ప్రతి ఆరు నెలలకోసారి ఉద్యోగ భద్రత గురించి ఆలోచించాల్సి వస్తోంది. అమెరికా విధించిన తాజా నిబంధనతో భారత్‌కు తిరిగి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి నగరాల్లో అమెరికా నుంచి తిరిగి వచ్చిన సాఫ్ట్‌వేర్ నిపుణులు ఉద్యోగాల కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

అమెరికాలో అనిశ్చితి పెరిగితే మరింత మంది స్వదేశానికి వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆంక్షలతో తెలుగు టెక్కీలు కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అమెరికాలో దీర్ఘకాల నిరీక్షణ, కఠిన వీసా నిబంధనలతో విసిగిపోయిన నిపుణులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.

విద్యార్థులపై కూడా తీవ్ర ప్రభావం!

విద్యార్థులపై కూడా అమెరికా తాజా నిబంధనల ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాలో చదివి అక్కడే ఉద్యోగం సాధించాలని భావిస్తున్న తెలుగు విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది. చదువు పూర్తయ్యాక ఉద్యోగం, వీసా, గ్రీన్‌కార్డు అన్నీ అనిశ్చితంగా మారుతున్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు.

అమెరికా ప్రభుత్వం మాత్రం వలస వ్యవస్థను క్రమబద్ధీకరించడమే లక్ష్యమని చెబుతోంది. కానీ దీర్ఘకాలంగా చట్టబద్ధంగా పనిచేస్తూ పన్నులు చెల్లిస్తున్న భారతీయ నిపుణుల భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

వీసా దరఖాస్తు దారుల్లో మనవాళ్లే ఎక్కువ

హెచ్-1బీ వీసాల కోసం ఏటా లక్షలాది మంది భారతీయులు దరఖాస్తు చేస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరానికి అమెరికా పౌరసత్వ, వలస సేవల శాఖకు మొత్తం 3,43,981 అర్హత కలిగిన దరఖాస్తులు అందాయి. ఇందులో భారతీయుల వాటా దాదాపు 70 శాతం వరకు ఉందని నివేదికలు చెబుతున్నాయి. అంటే సుమారు 2.3 లక్షల నుంచి 2.5 లక్షల వరకు భారతీయులు హెచ్-1బీ వీసాల కోసం ప్రయత్నించినట్లు అంచనా.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మొత్తం హెచ్-1బీ దరఖాస్తుల్లో 10 నుంచి 15 శాతం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే ఉన్నారు. ఆ లెక్కన చూస్తే ఈ ఏడాది సుమారు 25 వేల నుంచి 40 వేల మధ్య తెలుగు టెక్కీలు హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసినట్లు అంచనా. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, వరంగల్ ప్రాంతాలకు చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణులు, విద్యార్థులు ఎక్కువగా అమెరికా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు.

అమెరికాలో ప్రస్తుతం మొత్తం హెచ్-1బీ వీసాలలో భారతీయుల ఆధిపత్యమే కొనసాగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం మంజూరయ్యే హెచ్-1బీ వీసాలలో 73 శాతం వరకు భారతీయులకే దక్కుతున్నాయి. వీసాల కోటా మాత్రం ఏడాదికి కేవలం 85 వేలే ఉండటంతో పోటీ తీవ్రంగా ఉంటోంది. దరఖాస్తులు లక్షల్లో వస్తుండగా ఎంపికయ్యే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండటం తెలుగు యువతలో ఆందోళన కలిగిస్తోంది. పైగా అమెరికా తాజా కఠిన నిబంధనలు, ఉద్యోగాల కోతలు, గ్రీన్‌కార్డు ఆలస్యం వంటి కారణాలతో అక్కడ భవిష్యత్తుపై అనిశ్చితి మరింత పెరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టెక్కీల్లో అమెరికా కల ఇప్పటికీ బలంగానే ఉంది. ఏటా వేలాది మంది విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ నిపుణులు అమెరికా బాట పడుతున్నారు. అయితే తాజా పరిణామాలు చూస్తే అమెరికాలో స్థిరపడటం ఇక కలగానే మిగిలేలా ఉంది.

Leave a Reply