24thMaychintana | వినయంపై మహనీయుల సందేశం

24thMaychintana | వినయంపై మహనీయుల సందేశం

24thMaychintana | విద్యతో వచ్చే వినయ గుణం
రామకృష్ణ పరమహంస వినయమూర్తి
రమణ మహర్షి నిరాడంబర జీవితం
నాలుక – దంతాల ఉదాహరణలో వినయం
అహంకారానికి భిన్నమైన ఆత్మవిశ్వాసం

24thMaychintana | విద్య వినయాన్ని ప్రసాదిస్తే, ఆ వినయం వ్యక్తికి ‘పాత్రత’ను (అర్హత) కలిగిస్తుందనేది పెద్దల మాట. బాగా ఫలాలను కలిగిన చెట్లు, నీటితో నిండి ఉన్న మేఘాలు వినయంతో వాలి, వంగి ఉంటాయి. అలాగే సత్పురుషులు ఎప్పుడూ వినయశీలురై ఉంటారు.

డాక్టర్ మహేంద్రనాథ్ సర్కార్ కలకత్తాలో పేరున్న గొప్ప డాక్టర్. ధనవంతుడు. ఒకమారు ఆయన శ్రీరామకృష్ణ పరమహంసను కలుసుకోవడానికి దక్షిణేశ్వరం వెళ్లారు. అక్కడ ఆలయపు తోటలో అటూ ఇటూ తిరుగుతూ దైవనామ స్మరణ చేసుకుంటున్న పరమహంసను చూసి, తోటమాలి అనుకొని పొరపాటున “ఏయ్, తోటమాలీ! కొన్ని పూలు కోసి ఇవ్వు. పరమహంసకు సమర్పించాలి” అని గట్టిగా, గద్దించి అడిగారు ఆ డాక్టర్. మౌనంగా పూలు తీసుకువచ్చి ఆయన చేతిలో పెట్టారు రామకృష్ణులవారు. తర్వాత ఆ డాక్టర్ పరమహంస దర్శనార్థం వెళ్లి మిగతా భక్తులతో పాటు కూర్చొన్నారు. కొంతసేపటికి రామకృష్ణ పరమహంస లోనికి వచ్చారు. భక్తులంతా ఆయనకు నమస్కారాలు చేశారు. డాక్టర్ సర్కార్ ఆయనను చూసి ఆశ్చర్యపోయి, అతనిని తోటమాలి అని పొరబడిన తమ అజ్ఞానానికి పశ్చాత్తాపపడ్డారు. రామకృష్ణ పరమహంస నిరాడంబరత, వినయమ్రత అలాంటివి.

భగవాన్ రమణ మహర్షి కూడా గొప్ప వినయశీలురే. ఆయన ఆశ్రమంలో కానీ, అరుణాచలం కొండపైకి వెళ్లే దారిలోగానీ తమకెవరైనా ఎదురువస్తే తామే ప్రక్కకు తప్పుకొని దారి ఇచ్చేవారు. వినయం వ్యక్తికి వన్నె తెస్తుంది. జీవి పుట్టినప్పటి నుండి నోటిలో నాలుక ఉంటుంది. శిశువు పెరిగి పెద్దయ్యే కొద్దీ క్రమక్రమంగా దంతాలు ఏర్పడుతాయి. మొత్తం 32 దంతాలు నోటిలో ఉంటాయి. అవి దృఢంగా, కఠినంగా ఉంటాయి. నాలుక మెత్తగా, కోమలంగా ఉంటుంది. దంతాల మధ్య వినయంగా ఉంటూ నాలుక తన పని తాను చేస్తూ ఉంటుంది. నాలుక మృదువుగా, పట్టు విడుపులతో ఉండడం వలన చివరిదాకా సురక్షితంగా ఉంటుంది. కానీ గట్టిగా, కొనదేలి, కఠినంగా ఉండే దంతాలు మాత్రం కాలక్రమంగా అన్నీ ఊడిపోతాయి. జీవితంలో వినమ్రతతో ఉండాలి కానీ కఠినంగా, అహంకారంతో ప్రవర్తించరాదు. మధ్యలో వచ్చిన సిరిసంపదలు మధ్యలోనే పోతాయి.

వినయం అనే గుణం మనిషికి శోభనిస్తుంది. సంఘజీవి అయిన మనిషి విద్వాంసులు, నిష్ఠాగరిష్ఠులు, వయోవృద్ధులు, స్త్రీలపట్ల వినయం కలిగి ఉండాలి. లేకుంటే కష్టాల పాలవుతాడు. “నాకు ఏమీ తెలియదని నాకు తెలుసు” అని పలికిన సోక్రటీస్ గొప్ప తాత్వికవేత్త. “విజ్ఞానం సముద్రమంతటిదైతే దాని ఒడ్డున కూర్చొని గులకరాళ్లతో ఆడుకుంటున్న బాలుడిని నేను” అని చెప్పిన న్యూటన్ లాంటి శాస్త్రవేత్త వినయానికి మారుపేరుగా నిలిచిన మహనీయుడు. “నాకు తెలుసు” అనుకుంటే అది ఆత్మవిశ్వాసం. “నాకే తెలుసు” అనుకుంటే అది అహంకారం. వినయశీలుడు ఆత్మవిశ్వాసం కలిగిన వాడుగానే ఉంటాడు.

ఆది శంకరాచార్యుల వారు తమ ‘విష్ణు షట్పది స్తోత్రం’లోని మొదటి శ్లోకంలోనే “అవినయమపనయ విష్ణో” అని ప్రార్థించారు. స్వామీ! నాలోని అవినయాన్ని తొలగించమని అర్థం. కనుక ప్రతి వ్యక్తీ అలవరచుకోవాల్సిన మొట్టమొదటి సుగుణం ‘వినయం’.

వినయవంతులందరూ సౌజన్యవర్తులే.

డా|| గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి

Leave a Reply