AP Recycled Wastewater Policy | జల భద్రతకు కీలక అడుగు..
AP Recycled Wastewater Policy | స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా జల భద్రతపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి
శుద్ధి చేసిన మురుగునీటితో పరిశ్రమలు, పట్టణ సేవలకు ప్రత్యామ్నాయ జల వనరులు
2030 నాటికి 123 పట్టణ స్థానిక సంస్థల్లో 100 శాతం పునర్వినియోగమే లక్ష్యం
డ్యూయల్ పైపింగ్ విధానంతో తాగునీటి వినియోగంపై భారం తగ్గింపు
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు కొత్త పాలసీతో బలమైన ముందడుగు
సర్క్యులర్ ఎకానమీకి ఊతమివ్వనున్న విధానం: మంత్రి నారాయణ
AP Recycled Wastewater Policy |అమరావతి, ఆంధ్రప్రభ ప్రతినిధి: స్వర్ణాంధ్ర విజన్-2047 పది సూత్రాల్లో భాగంగా ప్రభుత్వం జల భద్రతకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా శుద్ధిచేసిన మురుగునీటి పునర్వినియోగ విధానం-2026కు ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, నగరాల విస్తరణ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పర్యావరణ హిత విధానాల అమలుకు కీలక నిర్ణయం తీసుకుంది.
తాగునీటితో పాటు ఇతర అవసరాలకు కూడా మంచినీటిపై ఆధారపడటాన్ని తగ్గించడం, మురుగునీటిని జలాశయాల్లోకి విడుదల చేయడాన్ని నివారించడం, పరిశ్రమలు, పట్టణ సేవలకు ప్రత్యామ్నాయ జల వనరులు అందించడం ద్వారా దీర్ఘకాలిక నీటి భద్రతను బలోపేతం చేయడమే ఈ విధానం ప్రధాన లక్ష్యం.
రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థలు, 79 మున్సిపాలిటీలు, 27 నగర పంచాయతీల్లో మొత్తం కోటీ 48 లక్షల జనాభా నివసిస్తోంది. జనాభా పెరుగుదల, పారిశ్రామికీకరణ, పట్టణ విస్తరణ, వాతావరణ మార్పులు కారణంగా నీటి అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మంచినీటి వనరులపై ఒత్తిడి అధికమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ దూరదృష్టి కలిగిన విధానాన్ని రూపొందించింది.
శుద్ధిజలాల పునర్వినియోగం
పట్టణాల్లో ఉత్పత్తి అయ్యే శుద్ధి చేసిన మురుగునీటిని పరిశ్రమలు, నిర్మాణ రంగం, ల్యాండ్స్కేపింగ్, పార్కులు, తోటలు, రోడ్ల శుభ్రత, అగ్నిమాపక సేవలు, రైల్వే యార్డులు, బస్ డిపోలు, ఓడరేవులు, భారీ వాణిజ్య సముదాయాల్లో వినియోగించనున్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల ద్వారా ఉత్పత్తి అయ్యే శుద్ధి చేసిన మురుగునీటిని 100 శాతం పునర్వినియోగం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
పర్యావరణ హిత చర్యలు
నీరు, పోషకాలు వంటి విలువైన వనరులను పునర్వినియోగం చేస్తూ సర్క్యులర్ ఎకానమీకి ఊతమివ్వనుంది. 2027 నాటికి 20, 2028 నాటికి 40, 2029 నాటికి 90, 2030 నాటికి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
పారిశ్రామిక అవసరాల్లో 2028 నాటికి 20 శాతం, 2030 నాటికి 40 శాతం నీటి అవసరాలను శుద్ధి చేసిన మురుగునీటితో తీర్చాలని ప్రభుత్వం నిర్దేశించింది. యూఎల్బీలకు 50 కిలోమీటర్ల పరిధిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు, 10 కిలోమీటర్ల పరిధిలోని పరిశ్రమలు, భారీ వాణిజ్య సముదాయాలు, రైల్వే యార్డులు, బస్ డిపోలు, ఓడరేవులు కూడా ఈ విధాన పరిధిలోకి వస్తాయి.
డ్యూయల్ పైపింగ్ వ్యవస్థకు ప్రోత్సాహం
గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, వాణిజ్య సముదాయాలు, సంస్థాగత భవనాల్లో డ్యూయల్ పైపింగ్ వ్యవస్థను ప్రోత్సహించనున్నారు. తాగునీటి అవసరాలు కాకుండా ఇతర వినియోగాలకు శుద్ధి చేసిన నీటినే ఉపయోగించేలా చర్యలు తీసుకోనున్నారు. పట్టణ, పారిశ్రామిక అవసరాలు తీరిన తర్వాత మాత్రమే వ్యవసాయ వినియోగాన్ని పరిశీలిస్తారు.
వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికార కమిటీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో అమలు కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రియల్‌టైమ్ పర్యవేక్షణ ద్వారా ప్రత్యామ్నాయ జల వనరుల వినియోగాన్ని పర్యవేక్షిస్తారు.
ఇదో నిర్ణయాత్మక ముందడుగు: మంత్రి నారాయణ
పట్టణీకరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కొత్త విధానం నిర్ణయాత్మక ముందడుగు అని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. రాష్ట్రంలో సుస్థిర నగరాల నిర్మాణానికి, జల భద్రతకు, కాలుష్య నియంత్రణకు ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
సర్క్యులర్ ఎకానమీకి బలమైన అడుగు: సురేష్ కుమార్
ఈ విధానం నగరాలను మరింత పరిశుభ్రంగా, పచ్చగా, నీటి భద్రతతో కూడినవిగా తీర్చిదిద్దుతుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. 2030 లక్ష్యాలను విజయవంతంగా సాధించేలా ఈ విధానం మార్గనిర్దేశం చేస్తుందని, ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలకు ఇది బలమైన పునాది అవుతుందని ఆయన పేర్కొన్నారు.
