బైక్‌పై వెళ్తూ వృద్ధుడి మృతి.. గుండెపోటు అనుమానం

బైక్‌పై వెళ్తూ వృద్ధుడి మృతి.. గుండెపోటు అనుమానం
లింగారెడ్డిగూడెం సమీపంలో విషాద ఘటన
చౌటుప్పల్, మే 23 (ఆంధ్రప్రభ): చౌటుప్పల్ మండల పరిధిలోని లింగారెడ్డిగూడెం గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం ఓ వృద్ధుడు బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మందోల్లగూడెం గ్రామానికి చెందిన దేవరకొండ శంకరయ్య (65) వృత్తిరీత్యా కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. పని నిమిత్తం తన బైక్ (టీఎస్ 30 కె 8907)పై చౌటుప్పల్ పట్టణానికి వచ్చిన ఆయన, పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు.
ఈ క్రమంలో లింగారెడ్డిగూడెం గ్రామ పరిధిలోని మార్లమైసమ్మ గుడి ఆర్చ్ సమీపానికి చేరుకోగానే మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయనకు ఒక్కసారిగా కళ్లు తిరుగుతున్నట్లు అనిపించింది. దీంతో వెనుక కూర్చున్న మనుమడు మొకరోజు మణికంఠకు విషయం చెబుతూ బైక్‌ను రోడ్డు పక్కకు ఆపారు.
అయితే కొద్దిసేపటికే శంకరయ్య ఒక్కసారిగా స్పృహతప్పి కిందపడిపోయారు. వెంటనే స్థానికులు, మనుమడు కలిసి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆసుపత్రిలోని డ్యూటీ డాక్టర్ పరీక్షించగా, అప్పటికే శంకరయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. గుండెపోటుతో మృతి చెందినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృతుడి కుమారుడు దేవరకొండ శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపారు. శంకరయ్య ఆకస్మిక మృతితో మందోల్లగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
