రైతు వేదికలో రైతు అవగాహన సదస్సు..

రైతు వేదికలో రైతు అవగాహన సదస్సు..
వికారాబాద్, ఆంధ్రప్రభ : సిద్దులోర్ రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. వాణిశ్రీ, డా. పద్మజ పాల్గొని రైతులకు ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు. పంటల మార్పిడి, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి పొదుపు పద్ధతులు, నాణ్యమైన విత్తనాల వినియోగంపై రైతులకు సూచనలు అందించారు.
హెచ్‌టి కాటన్ సాగు వల్ల కలిగే దుష్ప్రభావాలపై శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. అనుమతి లేని హెచ్‌టి కాటన్ విత్తనాల సాగు చట్టవిరుద్ధమని, అధికంగా కలుపు మందుల వినియోగం వల్ల నేల సారం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అదనంగా, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం ఉండటంతో పాటు దిగుబడులలో స్థిరత్వం ఉండకపోవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.
నానో యూరియా, నానో డి.ఏ.పీ వినియోగంపై కూడా రైతులకు శిక్షణ ఇచ్చారు. నానో యూరియా వాడకం ద్వారా సాధారణ యూరియా వినియోగాన్ని తగ్గించుకోవచ్చని, పంటలకు అవసరమైన పోషకాలు సమర్థవంతంగా అందుతాయని వివరించారు. నానో డి.ఏ.పీ వాడటం వల్ల మొక్కల ప్రారంభ పెరుగుదల మెరుగుపడటంతో పాటు ఎరువుల ఖర్చు తగ్గుతుందని తెలిపారు. రైతులు అధిక యూరియా వినియోగాన్ని తగ్గించి సమతుల్య ఎరువుల వినియోగం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఏఓ ప్రసన్న లక్ష్మి, ఏఈఓ కావ్య, సర్పంచ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ యు. వెంకటేష్, ఏఎంసీ డైరెక్టర్ ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
