ఇంద్రకీలాద్రిపై కూచిపూడి నృత్య ప్రదర్శన

ఇంద్రకీలాద్రిపై కూచిపూడి నృత్య ప్రదర్శన
భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రిపై శుక్రవారం సాయంత్రం జరిగిన ‘ధర్మపథం’ సాంస్కృతిక కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది. హైదరాబాద్‌కు చెందిన ‘రాధా కృష్ణ అకాడమీ’ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నృత్య కళాకారుడు టి. విజయ్ రామరాజు బృందం ప్రదర్శించిన సంప్రదాయ కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
ఈ నాట్య నీరాజనంలో కళాకారులు తమ అభినయంతో, ముద్రలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా అమ్మవారి వైభవాన్ని చాటే ‘నవదుర్గ’అయిగిరి నందిని’ ప్రదర్శనలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటితో పాటు ‘అలోకయే శ్రీబాలకృష్ణం’ ‘చంద్రచూడ’ ‘అర్ధనారీశ్వరం’ వంటి భక్తిరస నృత్య రూపకాలతో ఇంద్రకీలాద్రి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది.
దాదాపు గంటకు పైగా సాగిన ఈ ప్రదర్శనను భక్తులు ఎంతో ఆసక్తితో, తన్మయత్వంతో వీక్షించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం ఆలయ అధికారులు కళాకారులను శాలువాతో ఘనంగా సత్కరించి, అమ్మవారి శేషవస్త్రం మరియు ప్రసాదాలను అందజేశారు. వీకెండ్ ప్రారంభం కావడంతో అమ్మవారి దర్శనార్థం ఇంద్రకీలాద్రికి విచ్చేసిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సాంస్కృతిక వైభవాన్ని వీక్షించి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.
