ఈతతో పర్యావరణ సందేశం..

కృష్ణమ్మ ఒడిలో కలెక్టర్ ల‌క్ష్మీశ వినూత్న చైతన్య కార్య‌క్ర‌మం
జ‌ల వ‌న‌రులు.. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌కు మూలాధారాలని వ్యాఖ్య‌

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం కృష్ణా నదిలో ఈ ఒడ్డు నుంచి అవ‌త‌లి ఒడ్డుకు ఈదుతూ పర్యావరణ పరిరక్షణ, జల వనరుల సంరక్షణపై వినూత్న సందేశాన్ని ప్రజలకు అందించారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో విజయవాడలోని దుర్గా ఘాట్ వద్ద నుంచి క‌లెక్ట‌ర్ నదిని ఈ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు ఈదుతూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో జల వనరుల ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు. అవ‌తలి ఒడ్డున ప్రాంతంలో మొక్క‌లు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ ల‌క్ష్మీవ మాట్లాడుతూ నదులు కేవలం నీటి వనరులు మాత్రమే కాకుండా జీవ వైవిధ్యానికి, వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు, పర్యావరణ సమతుల్యతకు మూలాధారాలని పేర్కొన్నారు.

నదులు స్వచ్ఛంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం, ప్రకృతి ఆరోగ్యం సురక్షితంగా ఉంటాయని అన్నారు. ఈత అనేది ఆరోగ్యాన్ని పెంపొందించే ఉత్తమ వ్యాయామమని, ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం రోజున ఈత ద్వారా పర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించే కార్య‌క్ర‌మంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంద‌న్నారు. ప్రకృతితో మమేకమవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతాభావం పెరుగుతుందని చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, కాలుష్యం, నిర్లక్ష్య వైఖరి కారణంగా అనేక జల వనరులు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన కలెక్టర్.. ప్రతి పౌరుడు నదులు, చెరువులు, కాలువలను పరిశుభ్రంగా ఉంచేందుకు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

చెట్లు నాటడం, నీటిని పొదుపుగా వినియోగించడం, జల వనరులను సంరక్షించడం, పర్యావరణ హిత జీవన విధానాలను అలవర్చుకోవడం ద్వారా భావితరాలకు మెరుగైన నివాస‌యోగ్య‌మైన భూమిని అందించగలమని పేర్కొన్నారు. నది ఆరోగ్యంగా ఉంటేనే ప్రకృతి ఆరోగ్యంగా ఉంటుంది… ప్రకృతి ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు లింగిపిల్లి రామకృష్ణ, ఉపాధ్య‌క్షులు గోపాళం సాంబశివరావు, కోశాధికారి కొల్లిపర వెంకట రామయ్య , జాయింట్ సెక్ర‌ట‌రీ అమ్మిరెడ్డి రామిరెడ్డి, స‌భ్యులు గుండు జనార్ధన రావు, ఉమామహేశ్వర రెడ్డి, కె.సాంబయ్య, దాసరి యుగంధర్, తరుణ్ కాకాని (అమరావతి బోటింగ్ క్లబ్) త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply